
వెనుకబడిన తరగతుల(Backword Classes)కు చెందిన ప్రతి కులానికి ఒక అసెంబ్లీ సీటు కేటాయించాలన్న డిమాండ్ తో బీసీల సింహగర్జన సభ నిర్వహిస్తామని BC కుల సంఘాల సమావేశం నిర్ణయించింది. సెప్టెంబరు 10న హైదరాబాద్ లో ఈ మహాగర్జన సభ నిర్వహించాలని తీర్మానించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లతోపాటు మెజార్టీ ప్రజలున్న BCల నుంచి CMను ఎంపిక చేయాలని కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 80 కుల సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా భేటీ అయి పలు డిమాండ్లను ప్రకటించాయి. సర్వే రిపోర్టులు, గెలుపు గుర్రాల పేరుతో రెండు మూడు శాతం కమ్యూనిటీకి అడ్డగోలుగా సీట్లు కేటాయిస్తూ, తమ కులాల్ని విస్మరించిన పార్టీలకు పతనం తప్పదని లీడర్లు హెచ్చరించారు.
సెప్టెంబరు 10న హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే సభకు పెద్దసంఖ్యలో కులస్థులు తరలిరావాలని BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BC సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బైరు రవికృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, కుల సంఘాల నుంచి బాలరాజ్ గౌడ్, మదన్ కుమార్, పిట్ల నాగేశ్, కనకల శ్యామ్, తాటికొండ విక్రమ్ గౌడ్, శంకర్, బాలకృష్ణ సహా తదితరులు పాల్గొన్నారు.