ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలకు మరింత చేరువ కావాలన్న టార్గెట్ తో BJP అడుగులు వేస్తోంది. మరోసారి రాష్ట్రంలో బస్ టూర్ నిర్వహించాలని చూస్తున్న కమలం పార్టీ.. అందుకు తగ్గ సమాలోచనలు చేస్తున్నది. BJP చేపట్టబోయే బస్సు యాత్ర రాష్ట్రంలో మూడు రూట్లలో ఉండనుంది. ముగ్గురు టాప్ లీడర్లతో ఈ యాత్ర ఉండేలా ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ బస్ టూర్ సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు ఉండేలా.. అప్పటివరకు అన్ని ప్రాంతాల్లోని జనాల్ని కలుసుకునేలా అడుగులు వేస్తోంది. తొలి రూట్ ను ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాలను కలుపుతూ కుమురం భీమ్ మార్గంగా.. రెండోది రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల మీదుగా కృష్ణా రూట్.. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను కలుపుతూ గోదావరి పేరుతో మూడో రూట్ కు రూపకల్పన చేసింది.
ఈ యాత్రను కోఆర్డినేట్ చేసేందుకు 12 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక జిల్లాల వారీగా యాత్రను చూసుకోవడానికి జిల్లాల్లో స్పెషల్ కమిటీలు వేస్తున్నది. బస్సు యాత్ర పేరు, రూట్ మ్యాప్, కమిటీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బస్సు యాత్ర ద్వారా ఏయే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపైనా పార్టీ ముఖ్య నేతలంగా మీటింగ్ పెట్టుకుంటున్నారు.