భారతీయ జనతాపార్టీ(BJP) నుంచి లోక్ సభకు పోటీపడే మరో 111 మంది అభ్యర్థుల(Contestents) జాబితా(List)ను హైకమాండ్ విడుదల చేసింది. ఆదివారం అయిదో లిస్టు వెలువడగా, తెలంగాణలో మిగిలిపోయిన రెండు స్థానాలను ప్రకటించింది. అటు APలోనూ ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థిత్వాలను వెల్లడించింది. అయితే ఈ లిస్టులో ముగ్గురు కేంద్ర మంత్రులకు టికెట్ దక్కలేదు. ఎప్పుడూ వార్తల్లో నిలిచే సంచలన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు.
వీరికే నిరాకరణ…
కేంద్ర సహాయ మంత్రులు అశ్వినీకుమార్ చౌబే, విశ్వేశ్వర్ టుడూ, వి.కె.సింగ్ లకు పార్టీ టికెట్ దక్కలేదు. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ సెగ్మెంట్ నుంచి కంగనా పోటీ చేయబోతున్నారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి(Judge) పదవికి రాజీనామా చేసి BJPలో చేరిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పశ్చిమబెంగాల్ లోని తంలుక్ నుంచి పోటీ చేస్తారు. కేరళ వయనాడ్ లో రాహుల్ గాంధీపై అక్కడి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ ను బరిలోకి దింపుతున్నారు.
వరంగల్, ఖమ్మం నుంచి…
తెలంగాణలో మిగిలిపోయిన వరంగల్, ఖమ్మం స్థానాలకూ అభ్యర్థుల్ని BJP ప్రకటించింది. ఈ మధ్యనే BRS నుంచి కమలం పార్టీలో చేరిన ఆరూరి రమేశ్ వరంగల్ నుంచి, పార్టీ నేత తాండ్ర వినోద్ రావు ఖమ్మం నుంచి రంగంలో ఉంటారని పార్టీ హైకమాండ్ తెలిపింది. ఆరూరి రమేశ్ తో గులాబీ పార్టీ నుంచి వచ్చి చేరిన ఆరుగురు నేతలకు ఇప్పటివరకు BJP టికెట్లు దక్కినట్లయింది. సిట్టింగ్ MP బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి, మాజీ MPలు గోడం నగేశ్ ఆదిలాబాద్, సీతారాం నాయక్ మహబూబాబాద్, మాజీ MLA శానంపూడి సైదిరెడ్డి నల్గొండ, సిట్టింగ్ MP పి.రాములు తనయుడైన భరత్ ను నాగర్ కర్నూల్ నుంచి టికెట్లు కేటాయించింది.