పదేళ్లు పాలించి జనాల్ని నిండా మోసం చేసిన పార్టీ BRS అంటూ ఆరోపించిన BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి… ఆ పార్టీకి ఒక్క లోక్ సభ సీటు రాకున్నా ప్రజలకు వచ్చిన నష్టమేం లేదని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు. RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం(Free Journey) కల్పించినంత మాత్రాన ప్రజల జీవితాల్లో వెలుగులు కనపడవని కామెంట్ చేశారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఎప్పట్నుంచి అమలు చేస్తారో చెప్పాలని, అవి అమలయ్యేది లేదు, పొయ్యేది లేదన్న కోణంలో వాటి గురించే మరచిపోయారని కిషన్ రెడ్డి విమర్శించారు. మొన్నటి ఎన్నికలకు ముందు BRS ఎమ్మెల్యేపై ఛార్జిషీట్ ను కాంగ్రెస్ వేసినా.. ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో BRSకు ఎలాంటి అజెండా(Agenda) లేదని, కాబట్టి వచ్చే ఎలక్షన్లలో ఆ పార్టీ పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదని BJP రాష్ట్ర అధ్యక్షుడు విమర్శలు చేశారు.
రాష్ట్రంలో అప్పుడే కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలైందన్న కిషన్ రెడ్డి.. అమలు సాధ్యం కాని హామీలిచ్చి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు వెంటనే గుర్తించారని, సోనియా కుటుంబానికి తప్ప రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని గుర్తు చేశారు.