
అన్ని వర్గాలను దగ్గర చేసుకోవాలనే దృష్టితో ఉన్న BJP త్వరలోనే మేనిఫెస్టో(BJP Manifesto)ను విడుదల చేయనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Shah) చేతుల మీదుగా ఈ నెల 17న మేనిఫెస్టోను రిలీజ్ చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలియజేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ రెండు సార్లు హైదరాబాద్ లో పర్యటించారు. ఎల్.బి.స్టేడియంలో నిర్వహించిన BCల ఆత్మగౌరవ సభతోపాటు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన SC ఉపకులాల విశ్వరూప సభలో పాల్గొన్నారు. ఈ రెండు సభల ద్వారా తమ పార్టీ తరఫున ఇవ్వదలచుకున్న మెసేజ్ ను రెండు వర్గాలకు చేరవేయగలిగారు. ఇప్పుడు మరిన్ని హామీలు, అమలు చేయబోయే కార్యక్రమాల గురించి అమిత్ షా చేతుల మీదుగా ప్రకటించాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
నాలుగు బహిరంగసభలు
మేనిఫెస్టోను వెల్లడించేందుకు వస్తున్న అమిత్ షా.. అదే రోజు నాలుగు బహిరంగ సభలకు అటెండ్ అవుతారు. నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్ లో నిర్వహించే మీటింగ్ లకు కేంద్ర హోం మంత్రి హాజరవుతారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక షాతోపాటు మిగతా లీడర్లను కూడా ఢిల్లీ నుంచి రప్పించాలని చూస్తున్నది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలోని నేతల నామినేషన్ల కార్యక్రమానికి వచ్చివెళ్లారు. ప్రకాశ్ జవదేకర్, అశ్వినీకుమార్ చౌబే వంటి నేతలు రాష్ట్రంలో పర్యటించారు. ఇప్పుడు మరికొంతమంది కేంద్ర మంత్రులను రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రచారం నిర్వహించాలని BJP నిర్ణయించింది.