జమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి నిర్వహించిన ఓటింగ్ కు హాజరు కాని పార్టీ సభ్యులపై BJP సీరియస్ గా ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి సభ్యులు భారీగా అటెండయితే అధికార పార్టీ ఆధ్వర్యంలోని మిత్రపక్షాలు బాగా సపోర్ట్ చేశాయి. కానీ సొంత పార్టీ MPలే సభకు రాకపోవడంపై హైకమాండ్ పెద్దలు గుర్రుగా ఉన్నారు. లోక్ సభకు గైర్హాజరైన MPలకు కమలం పార్టీ నోటీసులు పంపే ప్రయత్నాల్లో ఉంది. జమిలి ఎన్నికల బిల్లుకు 269 మంది మద్దతు(Support) పలికితే, విపక్షాలకు చెందిన 198 మంది వ్యతిరేక ఓటు వేశారు. వాస్తవానికి మరింత మంది సభ్యుల మెజార్టీ అవసరమైన పరిస్థితుల్లో తమ పార్టీ MPలే హ్యాండ్ ఇవ్వడంపై కమలం పార్టీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు.
ఈ ఓటింగ్ కు రెండ్రోజుల ముందుగానే పార్టీ సభ్యులందరికీ విప్ జారీ చేసినా 20 మందికి పైగా BJP సభ్యులు అటెండ్ కాలేదు. ఇలా చేయడం వల్ల విపక్ష కూటమికి బలం కల్పించినట్లేనని భావిస్తున్న కమలం పార్టీ.. తక్షణమే జవాబు చెప్పేలా నోటీసులు పంపనుంది. అయితే అనుకున్నట్లుగా దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. మెజార్టీకి 307 మంది అవసరమని, కానీ 269 మంది మాత్రమే ఓటు వేయడం వల్ల జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టకూడదంటూ మాటల దాడికి దిగింది.