దేశ రాజధాని ఢిల్లీలో కమలం పార్టీకే మెజార్టీ సర్వేలు పట్టం కట్టాయి. ఇక ఆ పార్టీదే అధికార పీఠమని స్పష్టం చేశాయి. అదే జరిగితే BJP.. మూడు దశాబ్దాల తర్వాత విజయం అందుకున్నట్లవుతుంది. 1952లో హస్తినలో సాధారణ ఎన్నికలు జరగ్గా, 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా మారి అసెంబ్లీ రద్దు అయింది. కానీ 1991లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతం(NCR)గా ప్రకటించడంతో 1993లో తిరిగి తొలిసారి ఎన్నికలు జరిగాయి. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయో లేదో చూడాలి.
ఇదీ దేశ రాజధాని చరిత్ర…
1993లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో 49 స్థానాలతో BJP గెలవగా, మదన్ లాల్ ఖురానా CM అయ్యారు. అప్పుడు పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్నారు. 1998లో కాంగ్రెస్ 52 చోట్ల గెలిచి షీలా దీక్షిత్ ను CM చేసింది. ఆ కాలంలో వాజ్ పేయి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇలా ఢిల్లీలో BJP CM ఉన్న కాలంలో కేంద్రంలో కాంగ్రెస్… హస్తం పార్టీ CMగా ఉన్న టైంలో BJP కేంద్రంలో అధికారంలో ఉన్నాయి.
2003లో 47 స్థానాలతో గెలిచిన కాంగ్రెస్, 2008లో 43 సీట్లతో మరోసారి విజయం దక్కించుకుంది. ఈ రెండుసార్లూ షీలా దీక్షితే ముఖ్యమంత్రి కాగా, మొత్తం మూడు సార్లు ఆమె CMగా బాధ్యతలు చూశారు. 2013లో BJP 31, AAP 28, కాంగ్రెస్ 8 సీట్లు సాధిస్తే.. హస్తం పార్టీ సపోర్ట్ తో కేజ్రీవాల్ CM అయ్యారు. అప్పుడు కమలానికి ఎక్కువ సీట్లు వచ్చినా లాభం లేకుండా పోయింది. 2015లో AAP 67 సీట్ల బంపర్ మెజారిటీ సాధించి కేజ్రీవాల్ మరోసారి CM పదవి చేపట్టారు. BJPకి 3 వస్తే, కాంగ్రెస్ ఒక్కటీ గెలవలేదు. 2020లోనూ ఆప్ 62 సీట్లు ఎగరేసుకుపోతే మిగతా 8 బీజేపీవి. ఇక్కడా కాంగ్రెస్ కు సున్నానే మిగిలింది.