తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ పెద్దగా నాయకత్వం(Leadership) లేని దక్షిణ తెలంగాణ(South Telangana)లోనూ మెల్లమెల్లగా పాగా వేసింది భారత్ రాష్ట్ర సమితి(BRS) అప్పటి TRS. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన రెండు(2014, 2018) ఎన్నికల్లోనూ బంపర్ మెజారిటీతో ఆయా జిల్లాల్లో సీట్లు గెలుచుకుని హవా చూపించింది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీగా నియోజకవర్గాలు గెలుచుకుని పూర్తి ఆధిపత్యాన్ని చూపించిన గులాబీ పార్టీ… ప్రస్తుతం దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నది.
ఉన్న ఒక్క ఎమ్మెల్యే…
మొన్నటి ఎలక్షన్లలో 119 స్థానాలకు గాను 39కే పరిమితమైన కేసీఆర్ పార్టీ.. దక్షిణాదిలో తన ప్రాతినిధ్యం, ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతున్నది. ఖమ్మంలో తమకు ఏకైక MLA అయిన భద్రాచలం నేత తెల్లం వెంకట్రావు కూడా నిన్న హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈయన కారు గుర్తుపై గెలిచినా మొదట్నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. రేవంత్ సమక్షంలో వెంకట్రావు పార్టీ మారడంతో ఖమ్మంలో BRS ఖాళీ అయినట్లయింది.
మిగిలినవి మూడే…
ఖమ్మం ఇప్పటికే ఖాళీ అయితే ఇక మిగిలిన రెండు జిల్లాల్లోనూ ముగ్గురు మాత్రమే ఆ పార్టీ MLAలు ఉన్నారు. అందులో మాజీ మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట MLA జగదీశ్ రెడ్డి.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ నుంచి విజయుడు ఉన్నారు. మహబూబ్ నగర్ లో 14కు 12, నల్గొండలో 12కు 11, ఖమ్మంలో 10కి తొమ్మిదింటిని అధికార పార్టీయే గెలుచుకుంది. ఈ మూడు జిల్లాల్లోని 36 స్థానాలకు గాను 32 సీట్లను గెలుచుకోవడంతోనే పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.
గ్రూప్ పాలిటిక్స్ తోనే…
BRSకు గ్రూప్ పాలిటిక్సే ప్రమాదకరంగా మారాయి. ఈ విషయం ముందునుంచీ హైకమాండ్ కు తెలిసినా ఏం కాదులే అన్న నిర్లిప్తతే కనపడింది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారిని ప్రోత్సహించడం, అప్పటికే ఉన్నవారికి భరోసా ఇవ్వడంతో టికెట్లు ఎవరికి వస్తాయో, ఎవరికి మొండిచెయ్యి ఎదురవుతుందో అర్థం కాలేదు. ఇంచుమించు ప్రతి సెగ్మెంట్లోనూ రెబెల్ అభ్యర్థులు తయారయ్యారు. అయితే ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుంది.. తమకే బంపర్ మెజారిటీ అన్న అత్యుత్సాహంతో ఇప్పుడీ పరిస్థితి ఎదురైనట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అంటే కాంగ్రెస్ కు వచ్చిన 64 సీట్లలో సగం నియోజకవర్గాలు దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచే కావటం విశేషంగా మారింది. తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలుంటే అందులో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలే హస్తం పార్టీకి ఊహించని మెజార్టీని కట్టబెట్టాయి. ఇప్పుడీ మూడు జిల్లాల్లో కేవలం ముగ్గురు MLAలతోనే నెట్టుకురావాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది BRSకు.