
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర(Bus Tour)కు శ్రీకారం చుడుతున్నది. మరో వారం రోజుల్లో ఈ టూర్ మొదలు కానుండగా ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ పై రాష్ట్ర నేతలు చర్చించనున్నారు. అభ్యర్థుల సెలక్షన్ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు బస్సు యాత్ర చేపట్టాలని హస్తం పార్టీ నిర్ణయించింది. ఈ నెల 10న రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) సమావేశం కానుండగా.. కీలక లీడర్లంతా ఇందులో పాల్గొంటారు. ఏ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేయాలి.. ఎన్ని రోజుల టైమ్ అవసరమవుతుంది.. ఎవరెవరు ఎక్కడెక్కడ తిరగాలి అన్న అంశాలపైన చర్చ జరగనుంది. ఒక్కో రోజు ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టి వచ్చేలా ప్లాన్ తయారు చేస్తున్నారు.
అగ్రనేతల రాక
కాంగ్రెస్ పార్టీ చేపట్టే బస్ టూర్ కు అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే రానున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నారు. ఒకవేళ ఈ నెల 15న బస్సు యాత్ర మొదలైతే అదే రోజున ప్రియాంకను రప్పించాలని చూస్తున్నారు. 15, 16 తేదీల్లో ఆమె ప్రజలను కలుసుకుంటూ కాంగ్రెస్ విధానాలను వివరించనున్నారు. ఇక 18వ తేదీ నుంచి రాహుల్ పర్యటన ఉండేలా ప్లాన్ తయారు చేస్తున్నారు. రాహుల్ టూర్ రెండు లేదా మూడు రోజులు ఉండే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కూడా రప్పించి రెండు రోజుల పాటు రాష్ట్రంలో తిప్పాలని చూస్తున్నారు.
ప్రజల్లోకి పథకాల్ని తీసుకెళ్లేలా…
ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మూడు డిక్లరేషన్లు ప్రకటించగా ఇందులో ఎస్సీ, ఎస్టీ.. యూత్, అగ్రికల్చర్ డిక్లరేషన్లు ఉన్నాయి. దీనికితోడు సోనియా ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఉన్నాయి. ఈ స్కీమ్ లన్నీ జనాల్లోకి తీసుకెళ్లాలన్న టార్గెట్ గా బస్సు యాత్ర ఉండాలన్న కోణంలో చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయన్న భావనతో ఉన్న హస్తం పార్టీ లీడర్లు.. బస్సు యాత్రను సక్సెస్ ఫుల్ చేయాలన్న టార్గెట్ తో ముందుకు సాగుతున్నారు. మరి తమ మధ్య గల విభేదాల్ని పక్కనపెట్టి ఈ టూర్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఎంతమేరకు సక్సెస్ చేస్తారో చూడాల్సి ఉంది.