Published 18 Dec 2023
ఓడినవాళ్లకు ఏడాది దాకా పదవులు వద్దన్న హైకమాండ్…
సీటు త్యాగం చేసి మరీ వేరే చోట గెలవని ఒకరిద్దరు..
సభలో మైనార్టీల ప్రాతినిధ్యమే లేని కాంగ్రెస్..
ఇలాంటి సవాళ్లున్న దృష్ట్యా కాంగ్రెస్ సర్కారు చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణపైనే అందరి చూపు ఉంది. గెలిచిన అత్యంత సీనియర్లందరికీ పదవులు కట్టబెట్టిన రేవంత్ రెడ్డి.. తాజా విస్తరణలో ఎవరికి అవకాశం కల్పిస్తారో చూడాల్సి ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిన 54 మందికి ఏడాది దాకా ఎలాంటి పదవులు ఇవ్వొద్దని ఇప్పటికే పార్టీ అధిష్ఠానం(High Command) ఆదేశాలిచ్చినట్లు మాటలు వినపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓడిన సీనియర్లను MLCలుగా గెలిపించుకుని మంత్రి పదవులు కట్టబెట్టాలన్న ఆశకు గండిపడ్డట్లయింది. అయితే ముఖ్యమంత్రి కోసం సీటు త్యాగం చేసిన షబ్బీర్ అలీకి మాత్రం ఈ విషయంలో వెసులుబాటు కలిగే అవకాశమైతే ఉందన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే షబ్బీర్ అలీని MLC చేసి మంత్రిగా నియమిస్తే రెండు రకాల సమస్యా తీరుతుంది. సీటు త్యాగం చేసిన వ్యక్తిని గౌరవించుకోవడంతోపాటు మంత్రిగా మైనార్టీకి అవకాశం కల్పించనట్లవుతుంది.
మిగతా ఖాళీల భర్తీ ఎలా…
రాష్ట్రంలో 119 శాసనసభ్యులతోపాటు ఒక నామినేటెడ్ తో కలిపి 120 మంది MLAలు ఉంటారు. అందులో 15 శాతం మందికి అంటే 18 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. ముఖ్యమంత్రితోపాటు 11 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టగా మిగిలిన స్థానాలను డిక్లేర్ చేయాల్సి ఉంది. పార్టీలో ఉన్న మరికొందరు సీనియర్లకు అవకాశం కల్పిస్తారా.. లేదా కొత్తవారికేమైనా ఛాన్స్ ఉంటుందా.. ఇతర పార్టీల నుంచే వచ్చేవారిని లెక్కలోకి తీసుకుంటారా.. అన్నది తేలాల్సి ఉంది. వలసల గురించి ఇప్పుడైతే పెద్దగా పట్టించుకోకున్నా పార్టీలోని సీనియర్లపైనే దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేపు ఢిల్లీ వెళ్తుండగా.. రెండో దఫాలో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందోనన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.
ఆ సీనియర్లకు అవకాశముందా…!
జగ్గారెడ్డి, మధుయాష్కీ, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతలు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇలాంటి వారిలో కొందరికి మంత్రి పదవులిచ్చి కౌన్సిల్ కు పంపాలని భావించినా, హైకమాండ్ నిర్ణయం వేరేలా ఉందన్న మాటలు వినపడుతున్నాయి. అయితే ఈ పదవుల కోసం పార్టీలోని కొందరు నేతలు ఇప్పటికే ఢిల్లీ లెవెల్లో పైరవీలు మొదలుపెట్టారనేది టాక్. జిల్లాల్లో ఆశించిన స్థాయిలో సీట్లు సాధించినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పలేదు. కాబట్టి వచ్చే లోక్ సభ ఎన్నికల్లోపు గ్రేటర్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయాలంటే కొన్ని ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనా కనపడుతోంది. మరి వలస నేతల కోసం ఒకట్రెండు ఖాళీగా ఉంచి మిగతావి భర్తీ చేస్తారా, లేదంటే మిగిలిన అన్ని స్థానాలను కాంగ్రెస్ సభ్యులతోనే నింపుతారా అన్నది హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.