రైతు భరోసా విధివిధానాల(Guidelines)పై త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని CM రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం(Cabinet Sub-Committee) ఏర్పాటు చేశామని, ఆ కమిటీ జులై 15 లోపు నివేదిక ఇస్తుందన్నారు. రైతు రుణమాఫీతో 47 లక్షల మందికి లబ్ధి జరుగుతుందన్న ఆయన.. త్వరలోనే రైతు భరోసా గైడ్ లైన్స్ వెల్లడిస్తామన్నారు.
కమిటీలోని మంత్రులు వీరే…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటవుతుందన్నారు.
అపోహల్లేకుండా…
ప్రభుత్వ అంశాలపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయకుండా ఉండేందుకు గాను ఇద్దరు అధికార ప్రతినిధుల్ని నియమిస్తున్నామన్నారు. అన్ని పథకాలు, వివరణల కోసం మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చూస్తారన్నారు. మరోవైపు రైతు రుణమాఫీ రూ.2 లక్షలను ఏకకాలంలో మాఫీ చేస్తున్నట్లు CM వివరించారు.