Published 24 Nov 2023
రాష్ట్రంలో ప్రచారాల తీరు కీలక దశకు చేరుకుంది. ఇక్కడి నేతలు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే ఇక జాతీయ స్థాయి లీడర్లు సైతం అడుగుపెట్టబోతున్నారు. రేపట్నుంచి పార్టీల పెద్దలంతా తెలంగాణలో వాలిపోయి రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తూ పెద్దయెత్తున సభల్లో పాల్గొంటారు. అధికార BJP, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు చెందిన అగ్ర నేతలు వివిధ ప్రాంతాలు చుట్టి రానున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, BJP అధ్యక్షుడు జేపీ నడ్డా.. కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటనలు మొదలు పెట్టబోతున్నారు. ప్రధాని మూడు రోజుల పాటు ఈనెల 25 నుంచి 27 వరకు సభలు, ర్యాలీలో పాల్గొంటారు.
3 రోజుల పాటు మకాం
అమిత్ షా ఈ రోజే హైదరాబాద్ రానుండగా, మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఆర్మూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేటల్లో నిర్వహించే రోడ్ షోలు, బహిరంగ సభలకు అటెండ్ అవుతారు. మేడ్చల్, కార్వాన్, కంటోన్మెంట్ లో నిర్వహించే రోడ్ షోల్లో రాజ్ నాథ్ పాల్గొంటారు. ఇక ప్రధాని 6 బహిరంగ సభలతోపాటు హైదరాబాద్ రోడ్ షోకు అటెండ్ అవుతున్నారు. రేపు కామారెడ్డి, మహేశ్వరం సభలు చూసుకుని రాజ్ భవన్ లో బస చేస్తారు. ఈ నెల 26న తూప్రాన్, నిర్మల్ లో.. ఈనెల 27న మహబూబాబాద్, కరీంనగర్ సభలకు మోదీ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక సైతం సభలకు అటెండ్ అవుతున్నారు. ఈరోజు పాలకుర్తి, హుస్నాబాద్, కొత్తగూడెంలో, రేపు ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలో ప్రియాంక ప్రచారం చేస్తారు.