ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్(Indian National Congress) పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కీలక నేతకు టికెట్ రద్దు చేసి మరో నాయకుడికి ఆగమేఘాల మీద అప్పగించింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో కుస్తీపట్లు జరుగుతున్న వేళ.. ఈ విషయంలో మాత్రం ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోగలిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గ అభ్యర్థిగా సీనియర్ లీడర్ సురేశ్ షెట్కార్ పేరును ఇంతకుముందే ప్రకటించింది. కానీ ఇప్పుడు షెట్కార్ కు బదులు సంజీవ్ రెడ్డిని ఎంపిక చేసి బీఫామ్ అందిస్తున్నది. ఈరోజే ఆఖరి గడువు ఉండటంతో.. నామినేషన్ల దాఖలు ప్రారంభానికి కొద్ది ముందే ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర పార్టీ నేతలు సురేశ్ షెట్కార్ తో సుదీర్ఘంగా చర్చించి, ఆయనను అంగీకారానికి రప్పించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
లోక్ సభ స్థానం హామీ
సీనియర్ లీడట్ సురేశ్ షెట్కార్ అభ్యర్థిత్వ మార్పు విషయంలో హస్తం పార్టీ ఆచితూచి వ్యవహరించింది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఇరువురు నేతల్ని రాజీకి తెచ్చింది. మార్పునకు అంగీకరించిన షెట్కార్ కు లోక్ సభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఆయన కూడా దీనికి అంగీకరించడంతో సయోధ్య కుదిరినట్లయింది. దీంతో సంజీవ్ రెడ్డి ఈ రోజు రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ అందజేస్తారు.