
కుల గణన.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాట ఇది. బిహార్ ప్రభుత్వం చేపట్టిన సంచలనాత్మక సర్వే ద్వారా కులాల సంఖ్య తేలగా.. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల్లోనూ ఈ అంశం అగ్గి రాజేస్తున్నది. ఈ అక్టోబరు 2న నితీశ్ సర్కారు విడుదల చేసిన కుల గణన(Caste Survey) ద్వారా లెక్కలన్నీ బయటపడ్డాయి. బిహార్ తరహాలోనే తమ రాష్ట్రాల్లోనూ వీటిని అమలు చేయాలన్న డిమాండ్లు ఎప్పట్నుంచో ఉన్నా ఇప్పుడవి మరింత ఎక్కువయ్యాయి. లోక్ సభ ఎలక్షన్స్ కు కేవలం 6 నెలల ముందు జరిగిన ఈ సర్వే.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కుల గణన ద్వారా తమకు మేలేనన్న భావనతో ఉన్న లోకల్ పార్టీలు.. కసరత్తులు చేస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన ‘ఇండియా బ్లాక్’ పార్టీ క్యాస్ట్ సర్వేకు పిలుపునిచ్చింది. బిహార్ లో 63 శాతం BCలు ఉన్నారని గుర్తించగా.. సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి పథాన తీసుకెళ్లాలన్న లక్ష్యంతోనే ఈ సర్వేను చేపట్టినట్లు నితీశ్ తెలిపారు. 13.07 కోట్ల బిహార్ జనాభాలో అత్యంత వెనుకబడినవారు(EBC) 36%, ఇతర వెనుకబడినవారు(OBC) 27.13%.. దళితులు(SC) 19.65%, గిరిజనులు(ST) 1.68% ఉన్నారు. మొత్తంగా హిందువుల జనాభా 81.99% కాగా.. ముస్లింల జనాభా 17.7%గా ఉంది.
పైకి ఒక మాట… లోపల మరో ప్లాన్
కులగణన సాధ్యం కాదని కేంద్రం తేల్చడంతో గతేడాది జూన్ లో నితీశే స్వయంగా దీన్ని స్టార్ట్ చేశారు. 2023 జనవరిలో లెక్కలు మొదలైతే 38 జిల్లాల కోసం రెండు దశల్ని ఉపయోగించారు. OBC జనాభా రిజర్వేషన్ పరిమితిని మించిపోయిందని, కాబట్టి తక్షణం సవరణ చేయాల్సిన పరిస్థితులు ఉన్నందున కుల గణన డిమాండ్లు పైకి వినిపిస్తున్నా లోపల అసలు కారణం వేరే ఉంది. ఈ కులగణన వల్ల అల్పసంఖ్యాక వర్గాల ఓట్లను తేల్చి, వాటన్నింటినీ రాబట్టుకోవాలని ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయి. కులాల సంఖ్య ఆధారంగా స్కీమ్ లు ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి ఓటర్ల సంఖ్యను బట్టి ఆయా వర్గాల్ని మచ్చిక చేసుకోవాలన్న ఆలోచనతో పార్టీలు ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో SP, BSP, BJP, నిషాద్, సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(SBSP) దీనికి పట్టుబడుతున్నాయి. అటు పశ్చిమ్ బెంగాల్ లో మాత్రం TMC వ్యతిరేకించింది. అయితే దీనిపై మమత మనసు మార్చుకునే అవకాశం ఏర్పడవచ్చని అక్కడి పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దేశవ్యాప్తంగా అగ్రవర్ణ కులాల సంఖ్య 15 శాతం లోపే ఉంది. కానీ కీలక పదవులు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో మెజారిటీ వారిదే ఉంటుందన్నది బలహీన వర్గాలకు చెందిన సమాజం మాట. ముఖ్యంగా ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ 50 నుంచి 60 శాతానికి పైగా BC జనాభా ఉన్న రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదన్న విమర్శలున్నాయి.
ఆమోదించిన రాష్ట్రాలు
మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ అసెంబ్లీలు ఇప్పటికే కులాల సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కర్ణాటక, తెలంగాణలో కుల గణన సర్వేలు పూర్తయినా రిపోర్టులు మాత్రం బయటకు రాలేదు. నేషనల్ లెవెల్లో ఇది సాధ్యం కాదంటున్న BJP.. ఇప్పటికే ప్రధానే OBCకి చెందిన వ్యక్తిగా ప్రకటించింది. OBCలను కాపాడుకుంటూనే అగ్రవర్ణాలను సైతం దూరం చేసుకోరాదన్న భావనలో కమలం పార్టీ కనిపిస్తోంది. అది కేవలం కులాల వారీగా కాకుండా 82 శాతంగా ఉన్న హిందు జనాభాపై దృష్టిపెట్టినట్లు కనపడుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము అధికారంలోకొస్తే మొట్టమొదటగా చేపట్టబోయేది కులగణనే అని రాహుల్ గాంధీ గతంలోనే ప్రకటించారు. జన గణన అనేది కేంద్రానికి సంబంధించిన అంశమని, బిహార్ చేపట్టిన సర్వే సరికాదంటూ సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. 1948 జనాభా గణన ప్రకారం దీన్ని చేపట్టాల్సి ఉంటుందని, భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ లో చేర్చిన విషయాన్ని గుర్తు చేసింది. బిహార్ సర్వేను నిరసిస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్లు వేయగా.. వాటిని న్యాయస్థానం రిజెక్ట్ చేసింది. దీంతో ‘ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంలో పిటిషన్ వేసింది. ప్రస్తుతం కేసు సుప్రీంలో ఉన్నా.. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి మాత్రం చాలా రాష్ట్రాల్లో కుల గణన జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.