రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా మారింది. పార్టీలు మారుతున్న MLAలు, MLCలతో సభల్లో బలాబలాలు తారుమారవుతున్నాయి. ఇదే కొనసాగితే సభాపక్ష హోదాకు కూడా ఎసరొచ్చే అవకాశాలున్నాయి. శాసనసభ, శాసనమండలిలో పార్టీల బలమెంత.. ఎంతమంది గీత దాటితే విపక్షం హోదా రద్దవుతుందో చూద్దాం…
సభలో ఇలా…
ఎన్నికలప్పుడు కాంగ్రెస్ 64, BRS 39, BJP 8, MIM 7, CPI 1 గెలిచాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో లాస్య నందిత మృతితో ఉప ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి పాగా వేశారు. దీంతో హస్తం బలం 65కు, BRS సంఖ్య 38కి మారిపోయింది. ఇందులో ఆరుగురు(కడియం, తెల్లం వెంకట్రావు, దానం, పోచారం, సంజయ్, యాదయ్య) పార్టీ మారటంతో కారు బలం 32.. చేయి గుర్తు సభ్యులు 71 అయ్యారు.
మండలిలో…
శాసనమండలిలో మొత్తం 40 స్థానాలకు గాను BRS 29, కాంగ్రెస్ 4, MIM 2, BJP 1, మరో ఇద్దరు స్వతంత్రులు కాగా.. గవర్నర్ కోటాలో 2 ఖాళీగా ఉన్నాయి. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితోపాటు తాజాగా ఆరుగురు MLCలు పార్టీ మారడంతో కాంగ్రెస్ బలం 12కు, కారు సంఖ్య 21 అయింది.
డేంజరేనా…
ఏ సభలోనైనా మూడింట రెండు(2/3) వంతు సభ్యులు పార్టీ మారితే ఆటోమేటిగ్గా ఆ పార్టీ సభాపక్ష హోదా రద్దవుతుంది. ఇప్పుడు ఇదే ప్రమాదం కారుకు పొంచి ఉంది. శాసనసభలో ఇప్పటికే ఆరుగురు వెళ్లిపోగా మరో ముగ్గురు క్యూలో ఉన్నట్లు ప్రచారం ఉంది.
సమావేశాలు మొదలయ్యే వరకు మరింతమంది మారిపోవచ్చు. మండలిలో ఇప్పటికే 8 మంది మారితే మరో ఆరుగురు రెడీగా ఉన్నారన్నవార్తలు వినపడుతున్నాయి. రికార్డుల ప్రకారం నామినేటెడ్ మెంబర్లతో కలిపి BRSకు 29 మంది ఉన్నారు.
ఇందులో నలుగురు నామినేటెడ్ MLCలను మినహాయించి మిగిలిన 25 మందిలో మూడింట రెండొంతుల లెక్కన 17 మంది పార్టీ వీడితే సభాపక్షం చేజారే అవకాశముంటుంది. ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం గులాబీ పార్టీకి గుబులే.