సీనియర్ లీడర్ అయిన ఆయనకు మొన్నటి ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్(Confirm) అయింది. మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇక గెలవబోతున్నారనే ప్రచారాన్ని ఆయన అనుచరులు పెద్దయెత్తున చేసుకున్నారు. కానీ చివరి లిస్టు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ… అనూహ్యంగా అందులో నుంచి ఆయన పేరును తొలగించింది. దీంతో ఆయన వర్గీయులంతా గాంధీభవన్ వద్ద గొడవకు దిగారు. ఆనాడు మొండిచెయ్యి ఎదురైన ఆ సీనియర్ లీడరే జిల్లెల చిన్నారెడ్డి. ఎట్టకేలకు ఆయనకు కీలక పదవి కట్టబెట్టింది పార్టీ అధిష్ఠానం(High Command).
ప్లానింగ్ బోర్డుకు..
వనపర్తి నియోజకవర్గం నుంచి గెలుపొంది గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన చిన్నారెడ్డికి.. 2023 ఎన్నికల్లో టికెట్ దక్కకుండా పోయింది. అలాంటి సీనియర్ లీడర్ ను ఇప్పుడు ప్రణాళిక సంఘం(Planning Board) ఉపాధ్యక్షుడి(Vice Chairman)గా ప్రభుత్వం నియమించింది. కేబినెట్ మంత్రి ర్యాంకుతో ఈ పదవి కట్టబెడుతూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు. 1989, 1999, 2014 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన స్థానంలో తూడి మేఘారెడ్డికి టికెట్ ఇచ్చింది హస్తం పార్టీ. భవిష్యత్తులో కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మేరకు చిన్నారెడ్డికి కీలక పదవిని అప్పజెప్పింది.