కేంద్ర ప్రభుత్వంతో నిర్వహించాల్సిన సంబంధాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి క్లారిటీ ఇచ్చారు. గత BRS ప్రభుత్వానికి భిన్నమైన రీతిలో ప్రధాని ఎదుట కీలక మాటలు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత(Unity)గానే ఉంటామని.. ప్రధాని, గవర్నర్ ఇలా అందరితో స్నేహపూర్వకం(Friendly)గానే తమ ప్రభుత్వం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు(Politics) చేయాలి తప్ప.. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి రాష్ట్రాభివృద్ధికి విఘాతమన్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు గాను ఆదిలాబాద్ వచ్చిన ప్రధానికి ఆయన ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టుకు బదిలీ చేయడాన్ని రేవంత్ గుర్తు చేశారు.
గత ప్రభుత్వం వల్లే…
గత BRS ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ వెనుకబడిందన్న రేవంత్… NTPCకి తమ సర్కారు పూర్తిగా సహకరిస్తుందని మరోసారి స్పష్టం చేశారు. కేసీఆర్ తీరు వల్ల గత పదేళ్లలో కేవలం 1600 మెగావాట్ల విద్యుత్తును మాత్రమే రాష్ట్రం ఉత్పత్తి చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అటు మోదీతో, ఇటు గవర్నర్ తో దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆ కార్యక్రమాలకు అప్పటి CM కేసీఆర్ దూరంగా ఉండేవారు. ఇలాంటి ప్రవర్తన రాష్ట్రానికే చేటు అన్న రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆసక్తికరంగా మార్చింది.
దేశానికి హైదరాబాదే కీలకం…
భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు చేరడంలో హైదరాబాద్ కీలక పాత్ర వహిస్తుందని, మూసీ నది(Moosi River) అభివృద్ధికి కేంద్రం సహకరించాలని రేవంత్ కోరారు. విభజన చట్టం ప్రకారం 4,000 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయాల్సి ఉందని గుర్తు చేశారు.