
స్కిల్ డెవల్మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు వెళ్లక తప్పలేదు. ఈయన కన్నా ముుందే దేశంలో పలువురు ముఖ్యమంత్రులు, మాజీ CMలు కటకటాల పాలయ్యారు. అవినీతి, అక్రమాలు, క్రిమినల్ కేసుల్లో పలువురు ముఖ్యమంత్రులు(Chief Ministers) జైలుకు వెళ్లివచ్చారు. ఇందులో అత్యధికులు సీనియర్ నాయకులు, ఎక్కువ కాలం సీఎంలుగా పనిచేసినవారు కావడం విశేషం. తమిళనాడు, జార్ఖండ్ నుంచి ఇద్దరేసి చొప్పున అరెస్టయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత CM కుర్చీలో ఉన్న సమయంలోనే అరెస్టయ్యారు. 14 సంవత్సరాల పాటు ఆరు సార్లు CMగా పనిచేసిన ఆమెకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు రూ.100 కోట్ల ఫైన్ వేసింది. జనతా పార్టీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన కేసుతో ఆమెకు శిక్ష పడటంతో సీఎంగా ఉండగానే పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇక రాజకీయ కురువృద్ధుడిగా పేరుపడ్డ కరుణానిధి సైతం.. ఓ కేసులో అరెస్టయినా నేరం నిరూపణ కాలేదు. సుదీర్ఘకాలం CMగా పనిచేసిన ఆయనపై.. చెన్నైలోని ఫ్లై ఓవర్ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారనేది అభియోగం.

బొగ్గు కుంభకోణానికి(Scam) సంబంధించి జార్ఖండ్ CM మధుకోడా ఊచలు లెక్కబెట్టారు. ఆ రాష్ట్రానికి నాలుగో ముఖ్యమంత్రిగా పనిచేసిన మధుకోడాపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద కేసు ఫైల్ అయింది. UPA అలయెన్స్ లో 2006 నుంచి 2008 వరకు CMగా ఉన్నారు. ఇండిపెండెంట్ గా గెలిచి ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తిగా ఆయన పేరిట రికార్డు ఉంది. 1971లో ఒడిశాలో విశ్వనాథ్ దాస్, 2002లో మేఘాలయలో ఫ్లిండర్ అండర్సన్ ఖోంగ్లాంగ్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.25 లక్షల జరిమానా కోడాకు పడింది. ఇక అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబూ సోరెన్ సైతం.. మరో కారణంతో కటకటాల పాలయ్యారు. శిబూ సోరెన్ పర్సనల్ సెక్రటరీ సత్యనాథ్ ఝా కిడ్నాప్, హత్య కేసులో అరెస్టు కాగా.. ఆయన నిర్దోషి అని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. ఇక పాఠశాలల ఉపాధ్యాయుల నియామకానికి చెందిన కేసులో హర్యానా మాజీ CM ఓం ప్రకాశ్ చౌతాలా జైలు జీవితం గడిపారు. దేశ ఉప ప్రధానిగా పనిచేసిన దేవీలాల్ తనయుడైన చౌతాలా.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తొమ్మిదిన్నరేళ్లపాటు తీహార్ జైలు శిక్ష అనుభవించారు. 1999-2000 కాలంలో 3,206 జూనియర్ బేసిక్ టీచర్స్ రిక్రూట్ మెంట్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ చౌతాలతోపాటు మరో 53 మందిని న్యూఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది.

అత్యంత చిన్న వయసు(29)లో లోక్ సభ మెంబర్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్.. ముఖ్యమంత్రిగా, కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. బిహార్ కు చెందిన ఈయనకు దాణా కుంభకోణంలో రాంచీలోని CBI ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.60 లక్షల ఫైన్ వేసింది. మధుకోడా మాదిరిగానే మైనింగ్ స్కాంకు సంబంధించిన కేసులో BJP సీనియర్ లీడర్, కర్ణాటక మాజీ CM యడ్యూరప్ప జైలు జీవితాన్ని అనుభవించారు. ఈయన రెండు సార్లు ముఖ్యమంత్రి పనిచేశారు. అటు నితిన్ గడ్కరీ అవినీతి పరుడని ఆరోపణలు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కారాగార వాసం పూర్తి చేసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు రెండు సార్లు CM సేవలందించిన చరణ్ సింగ్ సైతం.. ఇందిర హయాంలో ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయ్యారు. 1995-2004 వరకు ఉమ్మడి APకి 2014-2019 వరకు విభాజ్య ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. తాజాగా రాజమండ్రి జైలుకు వెళ్లారు. ఉమ్మడి APలో అత్యధిక కాలం CMగా ఉన్న రికార్డు బాబు పేరిట ఉండగా.. స్కిల్ డెవల్మెంట్ స్కామ్ లో ఇప్పుడు కోర్టు రిమాండ్ విధించింది.