రాష్ట్రంలో ప్రస్తుతం తమ పార్టీ అధికారంలోకి రాకపోతే యువత పరిస్థితి అడవి బాటేనని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగాలు లేక ఇప్పటికే ఎందరో అవస్థలు పడుతున్నారని, మరోసారి KCR గెలిస్తే కష్టాలు తప్పవన్నారు. ఎన్నికల ప్రచారం(Election Campaign)లో భాగంగా కామారెడ్డి, స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్నపేటలో నిర్వహించిన విజయభేరి యాత్ర రోడ్ షోలు, సభల్లో ఆయన పాల్గొన్నారు. 3 గంటల కరెంటే ఇస్తారంటూ తమపై KCR కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తున్నదని, హస్తం పార్టీ అధికారం చేపడితే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని గుర్తు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ కు 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ ఇస్తామని, ఇప్పటికే కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయన్నారు. రైతులతోపాటు కౌలు రైతులకు సైతం రూ.12,000 రైతు భరోసాను అందిస్తామని, BRS ఓడిపోతే ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు అందిస్తామన్నారు.
భూములు గుంజుకునేందుకే
భూములు గుంజుకునేందుకే KCR కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, ఆయన్ను ఓడించేందుకు తాను అక్కడ బరిలోకి దిగినట్లు రేవంత్ చెప్పారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఉద్యోగాలు ఉన్నంతకాలం రాష్ట్రంలో యువతకు జాబ్ లు రావని, KCR నుంచి కామారెడ్డిని కాపాడే బాధ్యత తనది అని అన్నారు.