Published 07 Jan 2024
గత శాసనసభ ఎన్నికల్లో(Assembly Elections)లో ఓటమి తర్వాత అధికారం కోల్పోయిన తీరుపై దృష్టిసారించిన భారత రాష్ట్ర సమితి(BRS) నాయకత్వం.. జరిగిన తప్పిదాల గురించి పునరాలోచన చేస్తోంది. ఇప్పటికే దీనిపై మాజీ మంత్రి కేటీ రామారావు ఆసక్తికర కామెంట్స్ చేయగా.. ఆయన మరోసారి అలాంటి మాటలనే మాట్లాడారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ముందుగా ప్రచారం జరిగిన విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే బాగుండేదన్న కామెంట్ చేశారు.
ఈసారి అలా జరగదు…
కానీ ఈసారి జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లలో మాత్రం అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అన్న కోణంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఇప్పటికే రేవంత్ ట్వీట్ చేస్తే… అటు KTR సైతం హాట్ హాట్ గా మాట్లాడటం చర్చనీయాంశమైంది. లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షం BRS… ఈరోజు జహీరాబాద్ స్థానంపై సమీక్ష(Review) చేపట్టింది.
ఆత్మావలోకనం దిశగా…
గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లపై ఆత్మావలోకనం చేసుకుంటున్న పార్టీ లీడర్లు, కార్యకర్తలు.. ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో పూర్తిస్థాయిలో చర్చల ద్వారా తెలుసుకుంటున్నారు. ‘గత ఎన్నికల్లో సిట్టింగ్ లను మారిస్తే బాగుండేది.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఈ పొరపాట్లు జరగనివ్వం.. ముక్కోణపు పోటీలో మాకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.. కాంగ్రెస్ కు ఓటేసినోళ్లు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు.. కొత్త జిల్లాలు రద్దు చేయాలని చూస్తే ప్రజలు ఊరుకుంటారా.. హస్తం పార్టీ హామీలపై ప్రజల్లోకి వెళ్లి ఒత్తిడి పెంచుదాం’.. అని పార్టీ శ్రేణులతో అన్నారు.