Published 25 Nov 2023
కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న దళిత బంధు పథకం(Dalitha Bandhu Scheme) MLAలకు కమీషన్లు అందించే వరప్రదాయినిగా మారిందని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ స్కీమ్ లో ఒక్కో లబ్ధిదారు నుంచి MLAలు రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో ప్రచారం నిర్వహించిన రాహుల్.. KCR కుటుంబం పదేళ్లుగా దోపిడీకి పాల్పడుతూనే ఉందని ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యుల చేతుల్లోనే కీలక శాఖలు ఉంటాయని, తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు దొరల పాలన చూశారని వివరించారు. KCR అవినీతిపై మోదీ విచారణ జరిపించగలరా అని రాహుల్ ప్రశ్నించారు.
ఆ ఇద్దరూ మోదీకి దోస్త్ లు
కేసీఆర్, MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీలు మోదీకి మంచి మిత్రులన్న రాహుల్.. ప్రధానికి వారిద్దరూ ఢిల్లీలో సాయం చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైపోయిందని, తమ పాలన అమలులోకి వచ్చిన వెంటనే హామీలు, గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తామన్నారు.