ఇప్పటికే నలుగురు కేంద్ర పెద్దలకు రాజ్యసభ సీట్లు కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ(AICC).. తెలంగాణ విషయంలోనూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఇద్దరికి రాజ్యసభ సీట్లు కేటాయిస్తూ అధిష్ఠానం(High Command) ఆదేశాలు ఇచ్చింది. సీనియర్ నేతలు రేణుకా చౌదరి, యువ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయింది. మొన్నటి ఎన్నికల్లో హస్తం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 64 సీట్లు సాధించిన పార్టీకి మెజారిటీ ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కుతాయి. ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన మీదట కేంద్ర పార్టీ.. రేణుక, అనిల్ ను ఎగువ సభకు పంపాలని నిర్ణయం తీసుకుంది.
మాజీ MP తనయుడికి…
తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లు ఈ ఏప్రిల్ కు ఖాళీ అవుతున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. మెజార్టీ ప్రకారం కాంగ్రెస్ కు రెండు, BRSకు ఒక సీటు దక్కనున్నాయి. ప్రస్తుతం సీటు దక్కించుకున్న అనిల్ కుమార్.. యువజన కాంగ్రెస్ కు గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు. మాజీ MP అంజన్ కుమార్ యాదవ్ తనయుడైన అనిల్.. యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి అంజన్ కుమార్ ఓటమి పాలయ్యారు. అయితే అంజన్ కే అవకాశమివ్వాలని భావించినా… ఓడిపోయిన వారికి ఏడాది కాలం పాటు ఎలాంటి పదువులు ఇవ్వకూడదన్న పార్టీ నిబంధనల మేరకు అంజన్ కు బదులు ఆయన తనయుడు అనిల్ కు అవకాశం కల్పించింది.