రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నది మరోసారి నిరూపణైంది. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు ఉన్న పరిస్థితే ఇప్పుడు BRSకు ఎదురవుతున్నది. ఆనాడు హస్తం సభాపక్ష విలీనానికి లెటర్ రాస్తే.. నేడు గులాబీ పార్టీకి అదే తీరు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది.
నాడేమైంది…
2018 ఎన్నికల్లో అప్పటి TRS అన్నిచోట్లా పోటీ చేసి 46.87% ఓట్లతో 88 సీట్లు గెలుచుకుంది. పొత్తులతో కాంగ్రెస్ 99 సీట్లలో బరిలోకి దిగి 28.43% ఓట్లతో 19 స్థానాలు.. BJP 117 చోట్ల నిల్చొని 6.98% ఓట్లతో కేవలం గోషామహల్లో మాత్రమే గెలిచింది.
2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్(GHMC) ఎన్నికల్లో లెక్కలు మారిపోయాయి. BRSకు 56 సీట్లొస్తే 8.04% తగ్గుదలతో 35.81% ఓట్లకి చేరగా.. కమలం పార్టీ మాత్రం 25.22% పెరుగుదలతో మొత్తంగా 35.56% ఓట్లతో 48 సీట్లు సాధించింది. MIM నుంచి 44 మంది గెలిచారు.
ఉప ఎన్నికల్లోనూ…
బై ఎలక్షన్లలో దుబ్బాక నుంచి రఘునందన్, హుజూరాబాద్ లో ఈటల BJP నుంచి.. ఇక BRS తరఫున నాగార్జునసాగర్ నుంచి నోముల భగత్, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2018లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది కారు ఎక్కడంతో కాంగ్రెస్ సభాపక్షాన్ని విలీనం చేయాలంటూ లేఖ ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది.
ప్రస్తుతం…
మొత్తం 38 మందిలో ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారటంతో కారు బలం 31.. కాంగ్రెస్ మెజార్టీ 72 అయింది. మండలిలో మొత్తం 40కి BRS 29, కాంగ్రెస్ 4, MIM 2, BJP 1 ఇద్దరు స్వతంత్రులు ఉంటే.. గవర్నర్ కోటాలో 2 ఖాళీగా ఉన్నాయి. 8 మంది BRS నుంచి వెళ్లడంతో కాంగ్రెస్ బలం 12, కారు సంఖ్య 21 అయింది.
ఏ సభలోనైనా మూడింట రెండు(2/3) వంతులు పార్టీ మారితే ఆ పార్టీ పక్ష హోదా రద్దవుతుంది. నలుగురు నామినేటెడ్ లను మినహాయించి మిగిలిన 25 మందిలో మూడింట రెండొంతుల లెక్కన 17 మంది పార్టీ వీడితే గులాబీ సభాపక్షానిది అయోమయమే.
తారుమార్…
బై ఎలక్షన్లు, GHMCలో ప్రతికూల ఫలితాలతోపాటు MLAలు పార్టీని వీడటంతో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. ఇక చేతి గుర్తును ఏ మాత్రం లెక్కచేయని KCR.. కమలం పార్టీనే టార్గెట్ చేసుకున్నారు. ఒకానొక దశలో 2023 ఎన్నికలు BRS వర్సెస్ BJPనే అన్నది ఆనాటి టాక్. కానీ కర్ణాటక ఎన్నికలతో సీన్ ఛేంజ్ అయి తక్కెడ తారుమారైంది.