రాష్ట్రంలో రాజకీయ వాతావరణం గరం గరంగా సాగుతున్నది. ఒకవైపు ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు వెళ్తే మరోవైపు BRS పార్టీ సభ ఏర్పాటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం(Oath) చేసిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి శాసనసభ(Assembly)లో అడుగుపెట్టని గులాబీ పార్టీ అధినేత.. ఏకంగా నల్గొండ సభ ద్వారా ప్రజలకు దర్శనమిచ్చారు. అటు మేడిగడ్డపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి చేసిన సర్కారు.. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలియజేసేందుకు మేడిగడ్డ టూర్ ను పెట్టింది.
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా…
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు(మంగళవారం) పొద్దున అసెంబ్లీలో మరోసారి చర్చించిన ముఖ్యమంత్రి, మంత్రులు.. గత ప్రభుత్వ తీరును విమర్శించారు. మేడిగడ్డకు చేరుకున్న తర్వాత… కుంగిన ప్రాజెక్టును పరిశీలిస్తూ అక్కడి పరిస్థితిని CM, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి విపక్ష ఎమ్మెల్యేలకు చూపించారు. ఈ కార్యక్రమానికి BRS, BJP దూరంగా ఉంటే.. MIM, ఇతర పక్షాలు మేడిగడ్డకు చేరుకున్నాయి. ప్రాజెక్టు కుంగిన తీరుపై అక్కడే పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించి కాళేశ్వరం నిర్వహణకు ఎంత ఖర్చు చేస్తున్నారనే దానిపై ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.
రా… చూసుకుందాం…
నల్గొండ సభ ద్వారా కేసీఆర్ తన మునుపటి మాటల వేడిని మరోసారి చూపించారు. మమ్మల్ని ఏం చేస్తారు.. రండి దమ్ముంటే.. చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. ప్రజల్లోనే తేల్చుకుందామంటూ నల్గొండ సభకు పిలుపునిచ్చానని, రాష్ట్రంలో తొమ్మిదేండ్లు లేని కరెంటు కోతలు ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కరెంటు బిల్లులే ఏటా రూ.10,500 కోట్లు అని.. రుణాలు, ఇతర ఖర్చులు కలిపితే ప్రతి సంవత్సరం రూ.25 వేల కోట్ల దాకా అవుతున్నాయని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి, మంత్రులకు వివరించారు. ఇలా అధికార, ప్రధాన ప్రతిపక్షం పరస్పర విమర్శలకు దిగడంతో రాష్ట్రంలో రాజకీయం గరం గరంగా తయారైంది.