రాష్ట్ర కాంగ్రెస్ లోని పలువురు ముఖ్య నేతల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం నడుమ హస్తం పార్టీ తాజాగా స్క్రీనింగ్ కమిటీని నియమించింది. ఈ ముఖ్యమైన కమిటీలో సదరు లీడర్లకే స్థానం దక్కడం ఆశ్చర్యకరంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో క్యాండిడేట్ల అబ్జర్వేషన్ కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కేరళ మాజీ CM కరుణాకరన్ కుమారుడు MP కె.మురళీధరన్ కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. మహారాష్ట్ర MLA బాబా సిద్ధిఖీ, గుజరాత్ MLA జిగ్నేశ్ మేవానీ సభ్యులుగా ఉండనున్నారు.
ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రేతోపాటు రాష్ట్రం నుంచి PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, CLP నేత మల్లు భట్టివిక్రమార్క, MP ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూసే AICC కార్యదర్శులను నియమించింది. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా పరిశీలన చేసి అభ్యర్థుల ఎంపికను ఈ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్క్రీనింగ్ కమిటీకి ఆదేశాలిచ్చారు.