Published 26 Jan 2024
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ ను ప్రస్తుతం శాసనమండలి సభ్యుడు(MLC)గా నామినేట్ చేయడంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీ అధ్యక్షుడికి MLC కట్టబెట్టి మాకో న్యాయం, కాంగ్రెస్ కో న్యాయమా అని మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ అనడంపై… కాంగ్రెస్ సీనియర్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) తీవ్రంగా స్పందించారు. ఉద్యమ సమయంలో కోదండరామ్ ను దేవుడిలాగా ప్రజలు చూశారని గుర్తు చేశారు.
నిజంగా భీష్ముడి పాత్రే…
తెలంగాణ ఉద్యమం సమయంలో కోదండరామ్ నిజంగానే భీష్ముడి పాత్ర పోషించారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆయన గురించి మాట్లాడే అర్హత KTRకు లేదన్నారు. కేసీఆర్ సీఎంగా కోదండరామ్ కు కనీసం అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదని, ఇప్పుడాయన్ను మేం MLC చేస్తే రాద్ధాంతమెందుకని ప్రశ్నించారు. కోదండరామ్ ను మీరు అవమానిస్తే మేం గౌరవించాం.. ఆయన్ను శాసనమండలి పంపించి ఒక పెద్దగా తగిన గౌరవాన్ని ఇచ్చాం.. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తారు.. అలాంటి వ్యక్తి పట్ల మీరు వ్యతిరేకంగా మాట్లాడతారా అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.