Published 06 Dec 2023
రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టబోతున్న రేవంత్ సర్కారుకు సంబంధించిన మంత్రివర్గ కూర్పుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎవరికి వారు సామాజిక మాధ్యమాల(Social Media) వేదికగా మంత్రి వర్గాన్ని కూడా ప్రకటించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హస్తం పార్టీలో అత్యంత సీనియర్ నేతలున్నందున పలువురికి ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) పదవులు దక్కుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా అందులో ఇద్దరు సీనియర్ నేతలుండగా.. ఒకరు పార్టీలో సీనియర్ వ్యక్తి కాగా, మరొకరు రేవంత్ కు అత్యంత సన్నిహితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరికీ డిప్యుటీ సీఎం పదవులు దక్కుతాయన్న ప్రచారం పెద్దయెత్తున నడిచింది. కానీ రేవంత్ ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన తర్వాత సీన్ అంతా మారిపోయినట్లే కనిపిస్తున్నది. ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నది కేవలం ఒకే ఒక్కరు అన్నది అందులోని సారాంశం. రాష్ట్రంలోని సీనియర్లను దృష్టిలో ఉంచుకుని తొలుత ఇద్దరు లేదా ముగ్గురికైనా డిప్యుటీ CM పదవులతోపాటు కీలక శాఖలు కట్టబెట్టే అవకాశముందన్న ప్రచారం జరిగింది.
పొరుగు రాష్ట్రం స్టైల్ లోనే అనుకున్నా…
AP మాదిరిగానే తెలంగాణలోనూ రేవంత్ సర్కారులో పలువురు డిప్యుటీ CMలు ఉంటారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ రేవంత్ ఢిల్లీలో హైకమాండ్ పెద్దల్ని కలిసిన తర్వాత సీన్ మొత్తం మారిపోయినట్లు స్పష్టమవుతున్నది. నలుగురైదుగురికి కీలక శాఖల్ని కట్టబెడుతున్నా డిప్యుటీ CM పదవిని మాత్రం ఒక్కరికే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అదే జరిగితే ఇప్పటివరకు రేవంత్ తోపాటు అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తికే ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశముందన్న వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సి ఉందంతే.