కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ కీలక కామెంట్స్ చేశారు. ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు(ఒకే దేశం-ఒకే ఎన్నికలు) సాధ్యం కావని కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడారు. రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. పుస్తకావిష్కరణ కోసం హైదరాబాద్ లో పర్యటించిన ఆయన.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైన ‘ఒకే దేశం-ఒకే ఎన్నికల’పై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. గతంలో దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూశారు. అత్యధిక కాలం పాటు ఇంఛార్జ్ గా బాధ్యతలు నిర్వహించారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నికల’పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులతో మొత్తం 10 మంది ఈ కమిటీలో ఉండబోతున్నారు. పైగా ఈ కమిటీకి కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి నియమితులయ్యారు. అటు కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేసిన గులాం నబీ ఆజాద్ సైతం ఈ కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. ఇలా ప్రధాన పార్టీలు, శాసన, న్యాయ వ్యవస్థలతో కూడిన కమిటీ ఏర్పాటైన దశలో దిగ్విజయ్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు.