
Published 29 Jan 2024
అతికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న దశలో.. పెద్దల సభ(Rajyasabha)కు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 మంది సభ్యులను ఎన్నుకునేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ప్రకటన వెలువరించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరుగురిని ఎన్నుకోవాల్సి ఉండగా.. తెలంగాణలో ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ ముగ్గురు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 10 మంది, బిహార్, మహారాష్ట్రలో ఆరుగురు చొప్పున ఎన్నికవ్వాల్సి ఉంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగింటి వరకు పోలింగ్ కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..
తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర… ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. APలో మూడు స్థానాలు గెలుచుకునేందుకు YSRCPకి అవకాశముంది. మెజార్టీ స్థానాలు ఉన్నందున ఈ మూడు సీట్లను అదే పార్టీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి.
సీఎం రమేశ్(BJP), కనకమేడల రవీంద్రకుమార్(TDP), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(YCP).. ఇలా ముగ్గురు మూడు వేర్వేరు పార్టీల నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీకాలం ఈ ఏప్రిల్ తో ముగిసిపోనుండగా.. ఆలోపు కొత్త సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. తెలంగాణ సంఖ్యా బలం చూస్తే ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేనందున రెండు పార్టీల మధ్య పోరు తప్పేలా లేదు.
ఎన్నికల షెడ్యూల్ ఇలా…
ఫిబ్రవరి 8 : నోటిఫికేషన్
ఫిబ్రవరి 15 : నామినేషన్లకు చివరి తేదీ
ఫిబ్రవరి 16 : నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 20 : నామినేషన్ల ఉపసంహరణ
ఫిబ్రవరి 27 : పోలింగ్
ఫిబ్రవరి 27 : కౌంటింగ్ (సాయంత్రం నుంచి)