ఎప్పుడూ హుషారుగా, దూకుడుగా కనిపించే బండి సంజయ్.. తొలిసారి భారంగా కనిపించారు. బాధ మనసులో ఉన్నా దాన్ని బయటపడకుండా కార్యకర్తలకు ధైర్యాన్నిచ్చేలా మాట్లాడారు. కిషన్ రెడ్డికి ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించిన సమయంలో బండి సంజయ్ ప్రసంగించారు. KCR ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన తర్వాత.. ప్రసంగం(speech) చివర్లో మనసు నుంచి ఆవేదనతో కూడిన మాటలు వచ్చాయి. ‘ఈ కంప్లయింట్ల సంస్కృతిని ఇకనైనా ఆపండి.. నా మీద కొంతమంది ఫిర్యాదులు చేశారు.. దిల్లీకి వెళ్లి కంప్లయింట్లు చేయడమనేది మానుకోండి.. కార్యకర్తల జీవితాలతో ఆటలు ఆడుకోకండి.. అంటూ ఆవేదనాపూరితంగా మాట్లాడారు.
మరోవైపు సంజయ్ ప్రసంగిస్తున్నంత సేపు కార్యకర్తల నుంచి సంజయ్.. సంజయ్.. అంటూ నినాదాలు వినిపించాయి. దానికి స్పందించిన ఆయన ‘ఇక్కడ నాయకులు ముఖ్యం కాదు.. సంజయ్ లాంటి వాళ్లు వస్తారు, పోతారు.. పార్టీనే ముఖ్యం. బూత్ స్థాయికి వెళ్లి ప్రచారం చేసేది మోదీయో, సంజయో, కిషన్ రెడ్డో కాదు.. కార్యకర్తలు.. కార్యకర్తలున్నంత కాలం పార్టీకి ఏం కాదు.. అని భావోద్వేగంగా మాట్లాడారు.
‘వైరల్’ గా రాజగోపాల్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం
ఇదే కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన తీరు.. అందరినీ కాసేపు భావోద్వేగానికి గురిచేసింది. ‘బండి సంజయ్ గారు.. కంపల్సరీగా ఒక మాట చెప్పాలె.. కళ్లల్లో నీళ్లు తిరిగినయ్ ఈరోజు.. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో BJPకి జోష్ తెచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే అది బండి సంజయ్.. ఈ రాష్ట్ర అధ్యక్షుడు కాక ముందునుంచే గొప్పగా పనిచేస్తున్నారు’ అంటూ ఆవేదనాపూరితంగా చెప్పడంతో స్టేజీ కింద ఉన్న ప్రతి ఒక్కరి నుంచి హర్షాతిరేకాలు కనిపించాయి. బండి సంజయ్ అంటూ నినాదాలు, చప్పట్లు వినిపించాయి. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. అందరూ కిషన్ రెడ్డిని పొగుడుతుంటే కోమటిరెడ్డి మాత్రం సంజయ్ గురించి ఆ తీరుగా మాట్లాడటం అందరినీ కదిలించింది.