Published 17 Dec 2023
అపజయం అనేది మనిషిని పరివర్తన వైపు నడిపించే సాధనమన్న మాటలు వింటుంటాం. ఓడిపోయినవాడు ఎప్పుడూ చెడ్డోడు కాదు అన్నది నానుడి. అలాంటి వేదాంతాన్ని మరోసారి గుర్తు చేశారు గత ఎలక్షన్లలో ఓడిపోయిన నియోజకవర్గ నేత. బలవంతుడు ఎప్పుడూ భూమి మీద బలవంతుడుగా ఉండడు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ MLA తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) అన్నారు. ‘బలవంతుడు కొన్నిసార్లు మాత్రమే బలవంతుడుగా ఉంటాడు.. ఏదో ఒక రోజు బలహీనుడు కాక తప్పదు.. వ్యవస్థలోనైనా, రాజకీయంలో, ఏ రంగంలోనైనా ఇంతే.. అలాగే బలహీనుడూ ఎప్పటికీ అలాగే మిగిలిపోడు.. ఆ బలవంతుడి టైమ్ గడిచేవరకు బలహీనుడు మౌనంగానే ఉంటాడు.. ఆ మౌనం బలహీనుడి బలహీనత కాదు.. కాలం చెప్పే నిర్ణయంలో బలహీనుడు కాస్తా బలవంతుడవుతాడు’ అంటూ జగ్గారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
5 సార్లు తాను పోటీ చేశానని, తొలిసారి 2014లో ఓడిపోయానన్న జగ్గారెడ్డి, ఇప్పుడు మరోసారి ఓడి రెండోసారి పరాజయం పాలయ్యానని చెప్పుకొచ్చారు. ఫస్ట్ టైమ్ ఓడినప్పుడు చాలా నేర్చుకున్నానని, ఇప్పుడు ఈ 10 రోజుల్లోనే ఇంకా చాలా అనుభవాలు వచ్చేశాయన్నారు. ఈసారి సంగారెడ్డి ప్రజలు తనకు ఐదేళ్లు రెస్ట్ ఇచ్చారని, అందుకే ఈ సమయాన్ని పూర్తిగా పార్టీ కోసమే ఉపయోగిస్తానని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. హస్తం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారని పేరున్న ఆయన పరాజయం పాలు కావడంతో.. మరో సీనియర్ సేవల్ని కాంగ్రెస్ సర్కారు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వేదాంతంతో కూడిన ప్రకటనను రిలీజ్ చేయడం చర్చకు కారణమైంది.