Published 02 DEC 2023
రాష్ట్రంలో ‘హంగ్’కు అవకాశముందా…?
మెజార్టీ వస్తే ఓకే…?
ఏ పార్టీకి మెజారిటీ రాకుంటే ఎలా…?
సర్వేలు స్పష్టంగా చెబుతున్నా ఇంకా అనుమానాలా…?
మెజార్టీపై కాంగ్రెస్ వార్ రూమ్ లో చర్చ సాగిందా…?
ఇపుడు ఈ విషయమే తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. అధికారం తమదే అని రెండు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా పాలనా పగ్గాలు చేపట్టేలా సీట్లు సాధిస్తామా అన్నది అనుమానంగా మారిందన్న మాటలు వినపడుతున్నాయి. ఇంచుమించు అన్ని సర్వేల్లోనూ హస్తం పార్టీదే అధికారమని ప్రకటించినా, ఇంకా ఏ మూలనో అనుమానాలు లేకపోలేదు. కాబట్టే లీడర్లంతా పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం కీడు శంకిస్తూనే ఉందన్న ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ కు 65-73 వస్తాయని పలు సర్వేల్లో తేలింది. అటు BRSకు 35-49 దాకా రావొచ్చని అంచనా వేశాయి. 70కి పైగా వస్తే ఎలాంటి సందేహాలు, అనుమానాలకు తావు లేకుండా కాంగ్రెస్ అధికారం చేపట్టవచ్చు. కొన్ని ఆటంకాలు ఎదురైనా మ్యాజిక్ ఫిగర్ కు వచ్చే ప్రమాదమేమీ ఉండదు. కానీ 60-65 మధ్య వస్తే పరిస్థితి ఏంటి.. ఇంకా తక్కువగా 55-65 మధ్య వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో మెదులుతున్నది.
ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ
BRSకు మూడోసారి అధికారం దక్కడం కష్టమేనని ఎగ్జిట్ పోల్స్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పినా.. ఆ సర్వేలన్నీ తూచ్ అన్నట్లు మాట్లాడారు KCR, KTR. పోలింగ్ పూర్తయిన తర్వాత పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించిన కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్, కేటీఆర్ మాటలతో కొంత అయోమయంలో పడ్డట్లే కనిపించింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తమకే అనుకూలంగా ఉన్నా తండ్రి, తనయులు మాత్రం అధికారం మాదే అని మాట్లాడటంతో ఇదేంది యవ్వారం అన్న ఆలోచన మొదలైంది కాంగ్రెస్ లో. అటు కమలం పార్టీకి, MIMకు వచ్చే సీట్లు ఇంచుమించు సమానంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘హంగ్’ వస్తే ఎలా ఉంటుందన్న చర్చ అందరిలోనూ మొదలైంది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లోనూ తేడాలు కనిపించడంతో పూర్తి మెజారిటీపై అనుమానాలు ఏర్పడ్డాయి. BRSకు 50 దాటినా వాళ్ల అధికారానికి ఢోకా లేదన్న ఊహాగానాలతో కాంగ్రెస్ లో అనుమానం మరింత పెరిగినట్లయింది.
డిప్యుటీ సీఎం మాటలతో…
కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వస్తుందని అంతా అనుకుంటున్న పరిస్థితుల్లో కర్ణాటక డిప్యుటీ సీఎం కామెంట్స్ హాట్ టాపిక్ గా మారడంతోపాటు కొన్ని డౌట్స్ తలెత్తేలా చేశాయి. తమ క్యాండిడేట్స్ తో కేసీఆర్ సంప్రదింపులు జరిపారంటూ చేసిన ఆరోపణలు ‘మ్యాజిక్ ఫిగర్’ పై అనుమానాలు కలిగేలా చేశాయి. రాష్ట్రంలో BRS ఎన్ని సర్వేలు చేయించుకుందో కాంగ్రెస్ కూడా అన్ని సర్వేలు చేసుకుంది. 60-65 సీట్లు వచ్చినా ‘జంపింగ్ జపాంగ్’లతో ఇబ్బందులుంటాయన్న టైమ్ లోనే DK కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అభ్యర్థులందర్నీ హైదరాబాద్ రమ్మనడం, ఒక్కొక్కరి వెంట ఒక్కో AICC అబ్జర్వర్ ఉండటం, ఫలితాలు వచ్చేవరకు మానిటరింగ్ టీమ్ ల కనుసన్నల్లోనే ఉండాల్సి రావడం వంటి అంశాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. అనుకోని రీతిలో హంగ్ గనుక వస్తే అందర్నీ తరలించేందుకు వీలుగా బెంగళూరు శివారులోని 10 రిసార్టులు రెడీ చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి. అదే జరిగితే MIM ఎలాగూ BRS వెంటే ఉంటుంది కాబట్టి ఇక BJP గెలిచే సీట్లపైనే ఉత్కంఠ ఉంటుంది. తమకు ఎలాగూ అధికారంలోకి వచ్చే ఆశలు లేవు కాబట్టి.. అనిశ్చితికర పరిస్థితుల్లో తమ ప్రాధాన్యాన్ని తెలియజేయాలన్న కసి కమలం పార్టీ శ్రేణుల్లో కనపడుతోంది. మరి ఒక పార్టీకే సంపూర్ణ మెజారిటీ వస్తుందా.. లేక హంగ్ వచ్చి అందర్నీ కంగు తినిపిస్తుందా అన్నది ఆదివారం మధ్యాహ్నానికి గానీ తేలదు.