టికెట్ల పరిశీలన జరుగుతున్న కొద్దీ హస్తం పార్టీలో వేరుకుంపట్లు వేడి రాజేస్తున్నాయి. లీడర్ల సిగపట్లతో ఎవరికి టికెట్ దక్కుతుందో లేదో తెలియదు గానీ కార్యకర్తలు మాత్రం గందరగోళంలో పడిపోయారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. పోటీదారులుగా భావిస్తున్న విష్ణు, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ మధ్య అంతర్గత విభేదాలు కనిపిస్తున్నాయి. టికెట్ తనకే దక్కుతుందంటూ అజహరుద్దీన్.. విష్ణు వ్యతిరేక వర్గంతో సమావేశం నిర్వహించడం కలకలం రేపింది. విష్ణు ప్రధాన అనుచరుడు భవానీ శంకర్ తో ప్రత్యేక భేటీ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తాను పోటీకి దిగుతున్నానని, విజయం తనదేనంటూ అజహర్ అంటున్నారు.
అటు కృష్ణానగర్ లో ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అజహర్ అటెండ్ అయ్యారు.
టికెట్ల పరిశీలనపై ఈరోజే గాంధీభవన్ లో సాయంత్రం నాలుగింటికి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విష్ణు, అజహరుద్దీన్ వేరుకుంపట్లు పెట్టుకోవడం పార్టీ శ్రేణుల్ని కలవరానికి గురిచేస్తున్నది.