రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం విడ్డూరమని BRS మంత్రులు అంటే… రేవంత్ రెడ్డి మాటల్ని వక్రీకరించారంటూ హస్తం పార్టీ లీడర్లు ఎదురుదాడికి దిగారు. రేవంత్ ప్రకటనపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సాగుదారులకు 24 గంటల కరెంటు వద్దంటూ దుర్మార్గపు ఆలోచన చేసిందని, గతంలోనూ కాంగ్రెస్ హయాంలో కరెంటు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోందంటూ మంగళ, బుధవారాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. దేశంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని BRSకు చెందిన మంత్రులు, పలువురు MLAలు విమర్శించారు.
అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశంపై దీటుగా స్పందించింది. రేవంత్ రెడ్డి మాటల్ని వక్రీకరించారని సీనియర్ లీడర్లు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. KCRకు రైతుల గురించి మాట్లాడే అర్హతే లేదని… ఈ దేశంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని తమ పార్టీయే తీసుకుందని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ ను రాష్ట్రంలో ప్రవేశపెట్టిందే తమ పార్టీ అని, రైతులకు పనిముట్లు, గిట్టుబాటు ధరలు అందుబాటులో ఉంచింది కాంగ్రెసేనని అన్నారు. విద్యుత్తు కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ BRSకు పొన్నం సవాల్ విసిరారు.