Published 15 Dec 2023
జీవితంలో తొలిసారి శాసనసభ(Assembly)లో అడుగుపెట్టిన నలుగురు MLAలకు కీలక పదవులు దక్కాయి. ఈ నలుగురిని ప్రభుత్వ విప్ లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, జాటోత్ రామచంద్రనాయక్, బీర్ల అయిలయ్యను విప్ లుగా నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తమ తమ నియోజకవర్గాల్లో(Constituency) వీరంతా అలుపెరుగని పోరాటం చేశారు. అలాంటి ఈ నలుగురి కష్టానికి తగిన ప్రతిఫలాన్నిస్తూ కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ విప్ లుగా నియమించింది.
నూతన విప్ ల నేపథ్యం…
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై పలు దఫాలుగా తీవ్ర పోరాటం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నుంచి ఎట్టకేలకు శాసనసభలో అడుగు పెట్టారు. 22,039 ఓట్లతో ఆయన కొప్పుల ఈశ్వర్ కు పరాజయం రుచి చూపించారు.
- ప్రముఖ పుణ్యక్షేత్రం కొలువైన వేములవాడ నుంచి విస్తృత పోరాటం చేసిన ఆది శ్రీనివాస్ సైతం మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఎంటరయ్యారు. BRS నుంచి లాస్ట్ మినిట్ లో టికెట్ దక్కించుకున్న చల్మెడ లక్ష్మీనరసింహారావును 14,581 ఓట్లతో ఓడించి చిరకాల కోరికను తీర్చుకున్నారు.
- డోర్నకల్ నుంచి జాటోతు రామచంద్రునాయక్ కారు గుర్తుకు చెందిన రెడ్యానాయక్ ను భారీ తేడాతో ఓడించారు. 53,131 ఓట్లతో గెలుపొందిన రామచంద్రు అసెంబ్లీలో అడుగుపెట్టారు.
- భువనగిరి జిల్లా ఆలేరు నుంచి భారీ మెజారిటీతో అప్పటి BRS ప్రభుత్వ విప్ గొంగిడి సునీతపై బీర్ల అయిలయ్య ఘన విజయం సాధించారు. సునీతపై ఈయనకు 49,204 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆనాటి ప్రభుత్వంలో సునీత విప్ గా ఉంటే ఈ ప్రభుత్వంలో అదే సెగ్మెంట్ నుంచి అయిలయ్య విప్ అయ్యారు.