ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP-ఆమ్ ఆద్మీ పొలిటికల్ వార్ లో ఆసక్తికర సన్నివేశం కనపడింది. యమునా నది(Yamuna River) నీటిలో విషం కలిపారంటూ కేంద్రంపై కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆయన కామెంట్స్ ఉత్తరాది రాష్ట్రాల్లో దుమారం రేపగా, హరియాణా CM నాయబ్ సింగ్ సైనీ రివర్స్ గేర్లో వచ్చారు. యమునా నది వద్దకు వెళ్లి నీళ్లు తాగి మరీ నెత్తిన చల్లుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యమునా నదిలోకి పారిశ్రామిక వ్యర్థాలు వదులుతున్నారని, కావాలనే వాటిని డంప్ చేస్తున్నారంటూ BJPపై ఆప్ అధినేత విమర్శలు చేశారు. నదిని కలుషితం చేయడం జల ఉగ్రవాదం లాంటిదని ఢిల్లీ CM అతీశీ సైతం తమ బాస్ కు సపోర్ట్ పలికారు.
ఆ నీటిలో అమ్మోనియం లెవెల్స్ ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని అతీశీ చెప్పడంతో.. హర్యానా CM వేగంగా స్పందించారు. ఢిల్లీ సమీపంలోని పల్లా గ్రామం వద్ద నది నీటిని తాగి నెత్తిన చల్లుకున్నారు. ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న హరియాణా సర్కారు.. కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసే ప్లాన్ లో ఉంది. కేజ్రీవాల్ నిరాధార ఆరోపణల వల్ల ఢిల్లీ ప్రజలు నీరు తాగాలంటే భయపడుతున్నారని, ఈ ప్రభావం తమ రాష్ట్రంపైనా పడుతుందని భావిస్తున్నందున ఆప్ చీఫ్ పై కేసుకు సిద్ధమైంది.