
పరస్పర దాడులు, అల్లర్లతో అట్టుడికే పశ్చిమ్ బెంగాల్ లో ఎలక్షన్లంటే అదో భయంకరమైన ప్రక్రియగా తయారవుతోంది. తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు… ఎలక్షన్ కమిషన్ కు, పోలీసులకు పెద్ద పంచాయితీనే తెచ్చిపెట్టాయి. ఎక్కడైనా ఎలక్షన్లు జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఏవో కొన్ని పోలింగ్ స్టేషన్లలో మాత్రమే రీపోలింగ్ పెడతారు. ఇది అన్ని చోట్లా జరిగే నార్మల్ తతంగమే. కానీ బెంగాల్ లో మాత్రం 19 జిల్లాల్లో రీపోలింగ్ నడుస్తోంది. 696 బూత్ ల్లో రీపోలింగ్ కు ఆర్డర్స్ ఇచ్చారంటేనే ఆ రాష్ట్రంలో ఎలక్షన్ వ్యవస్థ ఎలా ఉందో అర్థమవుతుంది. శనివారం జరిగిన విలేజ్ వైజ్ ఎలక్షన్లు… బెంగాల్ ను హోరెత్తించాయి. అల్లర్లు, గొడవలు, దాడులు, కాల్పులు… ఇలా ఎక్కడ పడితే అక్కడ చోటుచేసుకున్న హింసలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో BJP, తృణమూల్ కార్యకర్తలతోపాటు సామాన్యులు ఉన్నారు.

బ్యాలెట్ బాక్సుల్ని ఎత్తుకెళ్లడం, వాటిని బద్ధలు కొట్టి రణరంగం సృష్టించిన ఘటనలు శనివారం బెంగాల్ వ్యాప్తంగా జరిగాయి. ఒక్క ముషీరాబాద్ లోనే (175) పోలింగ్ బూత్స్ లో రీపోలింగ్ నడుస్తోంది. ఆ తర్వాతి స్థానంలో నదియాలో(89), కూచ్ బెహార్ లో(53), ఉత్తర 24 పరగణాల్లో(46) చోట్ల ఈ రోజు రీపోలింగ్ నడుస్తోంది. రీపోలింగ్ జరగని జిల్లాలు కేవలం మూడే ఉన్నాయంటే ఆశ్చర్యమే మరి. డార్జిలింగ్, ఝార్గమ్, కలింపాంగ్ జిల్లాల్లో మాత్రమే రీపోలింగ్ జరగట్లేదు.