Published 04 Dec 2023
రాకరాక వచ్చిన అధికారం…
ఎన్నాళ్లకో వేచిన ఉదయం…
ప్రజాబలంతో దక్కిన పట్టం…
ఇలా అందివచ్చిన అవకాశాన్ని తొందరగా అదిమిపట్టుకునేలా కనపడటం లేదు.. కాంగ్రెస్ పార్టీలో. మళ్లీ పాత కథే పునరావృతమై(Repeated) అనిశ్చితికి తాను ఎందుకు మారుపేరో నిరూపించింది ఆ పార్టీ. కేసీఆర్ సర్కారుపై వ్యతిరేకత.. బలమైన నాయకుడి చేతిలో పార్టీ పగ్గాలు.. అన్ని వర్గాల్లోనూ పాజిటివ్ దృక్పథం.. ఈ మూడూ కలిసి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. ఇప్పుడు అయోమయపు జాడల్లో చిక్కుకుంది. CLP నాయకుడి ఎంపిక పూర్తి కాగానే ఇక ప్రమాణ స్వీకారమే(Oath)నని అంతా భావిస్తున్న వేళ.. యథాలాపంగా పాత కథే కనిపించింది. దీంతో ఇక కాంగ్రెస్ మారేది కష్టమేనని అభిప్రాయం అప్పుడే జనాల్లో మొదలైంది.
అసలు సీఎల్పీ నేతను ఎన్నుకున్నారా…?
ఈ రోజు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో నిర్వహించిన మీటింగ్ కు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా అటెండ్ అయ్యారు. శాసనసభాపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. కానీ ఆ విషయాన్ని ప్రకటించకుండా అయోమయం సృష్టించారు. లోపల ఏం జరిగిందో కానీ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు వంటి నేతలు హడావుడిగా బయటకు వెళ్లిపోవడం.. కాసేపట్లోనే అబ్జర్వర్ DK శివకుమార్ నేరుగా ఢిల్లీ వెళ్లిపోతున్నట్లు చెప్పడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలు చూస్తే అసలు CLP నేతను ఎన్నుకున్నారా అన్న అనుమానాలు ప్రజల్లో బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై చర్చోపచర్చలు జరిగినా కొత్త సీఎం ఎంపికను అధిష్ఠానాని(High Command)కే పంపారు. ఇప్పుడు అక్కణ్నుంచి మెసేజ్ వస్తే తప్ప ఇప్పటికిప్పుడు ప్రమాణ స్వీకారం లేనట్లే.
అనుమానాలే నిజమయ్యేలా…!
హస్తం పార్టీ మెజారిటీ సీట్లు సాధించినా.. సీఎం, మంత్రులు బాధ్యతలు చేపట్టి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే సర్కారు ఏర్పడ్డట్లు అంటూ నిన్న రాత్రి నుంచే విపరీతమైన ఊహాగానాలు చెలరేగాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా, పార్టీని ఏకతాటిపైకి తెచ్చి అందర్నీ సమన్వయం చేసుకుంటూ రేవంత్ ముందుకు సాగడంతో దక్కిన విజయంగా భావించిన ఎంతోమంది.. ఆయన సీఎం కావడంపై పెద్దగా సందేహపడలేదు. అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాలు కూడా అలాగే ఉన్నాయన్న ప్రచారం జరగడంతో అధికారం చేపట్టడమే తరువాయి అన్న భావనకు వచ్చారు. కానీ చివరకు CLP నేతను ప్రకటించకుండానే మీటింగ్ ను అర్ధంతరంగా ముగించడంతో ప్రజల్లో మళ్లీ అనుమానాలు, ఊహాగానాలు చెలరేగుతున్నాయి.