
ఇతర పార్టీల్లో నుంచి చేరికలపై భారీగానే ఆశలు పెట్టుకున్న BJP.. ఈరోజు ఖమ్మంలో జరిగే సభ ద్వారా పెద్దసంఖ్యలో వచ్చి చేరతారని ఆశిస్తోంది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానుండటంతో ఆ స్థాయిలో చేరికలు ఉండేటట్లు చూసుకోవాలని ఇప్పటికే పలువురు లీడర్లతో రాష్ట్ర పార్టీ పెద్దలు మంతనాలు జరిపారు. ‘రైతు గోస – బీజేపీ భరోసా’ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు భారీయెత్తున జనసమీకరణ చేపట్టాలని చూస్తున్నారు. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు అక్కణ్నుంచి హెలికాప్టర్ ద్వారా అమిత్ షా ఖమ్మం చేరుకోనున్నారు. సభా వేదిక వద్దే BJP కోర్ కమిటీ సభ్యులతో మీటింగ్ పెడతారు. ఇప్పటికే BRS టికెట్లు ప్రకటించడంతో ఇక మిగిలింది కాంగ్రెస్, కమలం పార్టీయే కాబట్టి వీలైనంత ఎక్కువగా చేరికలు ఉండేటట్లు చూసుకోవాలన్న భావన పార్టీలో కనిపిస్తోంది. ముఖ్యమైన లీడర్లు చేరడం ద్వారా పార్టీ బలంగా మారడంతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయన్న భావన BJPలో కనపడుతోంది.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన వేళ ముఖ్యమైన లీడర్లు ఆ పార్టీలో చేరకుండా చూసేందుకు కూడా ప్లాన్స్ అమలు చేస్తున్నారు. BJPలో మంచి అవకాశాలు ఉంటాయన్న ఇండికేషన్స్ ను పార్టీ మారాలనుకున్న వారికి చేరవేసేందుకు ఇప్పటికే మంతనాలు సాగించారు. అయితే పార్టీ సిద్ధాంతాలు ఒంటబట్టించుకునేవాళ్లు ఎంతమంది ఉంటారు.. అలాంటి వారిలో ఎంతమంది చేరతారు అన్నది మాత్రం సస్పెన్స్ గా తయారైంది. కానీ పెద్దసంఖ్యలో చేరికలతో అమిత్ షా మెప్పు పొందాలని మాత్రం రాష్ట్ర కమలం పార్టీ లీడర్లు సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నారు.