
ఏదైనా పార్టీ బలంగా కనపడాలంటే రెండే రెండు అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి అధికారంలో ఉండటం.. రెండోది నిత్యం ప్రజల్లో ఉండటం ద్వారా వారి నుంచి ఎప్పటికప్పుడు రెస్పాన్స్ రావటం. మరి ఈ రెండింట్లో మొదటి బలం హస్తం పార్టీకైతే లేదు. మరి రెండో కోణమైన ప్రజల నుంచి రెస్పాన్స్ అనేది ఎలా ఉంది…! ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా ఎలా ఉన్నా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్లకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉందా..! అధికార BRSకు చెక్ పెట్టే స్థాయికి చేరుకున్నట్లేనా..! ఇక అధికారమే తరువాయా..! అన్న మాటలు బాగా వినపడుతున్నాయి. BRSకు ఎన్ని సీట్లు వస్తాయి… కాంగ్రెస్ గట్టి పోటీనిస్తుందా.. BJPకి ఎన్ని రావొచ్చు.. అన్న మాటలు అందరిలోనూ ఉన్నా ఎవరిలోనూ పెద్దగా క్లారిటీ కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం… రాష్ట్రంలో నెలకొన్న పొలిటికల్ వాతావరణమే.
ఇప్పటికే BRS టికెట్లు అయిపోయాయ్. ఇక మిగిలింది కాంగ్రెస్, BJPనే. సిద్ధాంతాలు అడ్డొచ్చే వారందరూ నమ్ముకునేది మాత్రం హస్తం పార్టీనే అన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే అసెంబ్లీ టికెట్ల కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఏకైక ఆశాకిరణంగా కనిపిస్తోంది. అందుకే కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు వచ్చిపడ్డాయి. 1,000 అప్లికేషన్లు వచ్చాయంటేనే కాంపిటీషన్ ఎలా ఉందో తెలుస్తున్నది. ఉన్నవి 119 సెగ్మెంట్లే. ఒక్కో నియోజకవర్గానికి యావరేజ్ గా 8 మంది పోటీ పడుతున్నట్లు లెక్క. ఖమ్మం జిల్లా ఇల్లెందు స్థానానికి 38 మంది అప్లై చేశారు. ఇప్పటికే కాకలు తీరిన సీనియర్లతోపాటు కొత్తగా చేరిన MLA స్థాయి వ్యక్తులు టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. సీనియర్లకు స్థానాలు ఫిక్స్ కాగా.. సెగ్మెంట్ పరిస్థితుల్ని బట్టి కొత్తగా చేరినవారిలో ఒకరిద్దరికి మాత్రమే చోటు దక్కవచ్చు. ఈ రెండు ఇలా ఉంటే ఇక పాతుకుపోయిన లీడర్ల కుటుంబీకులు, అనచరులు కూడా బరిలో ఉంటారు. ఇక BRSను పరిశీలిస్తే ఇప్పటికిప్పుడు ఆ పార్టీలో పెద్దగా అసంతృప్తులు కనపడకపోవచ్చు. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇలాగే ఉంటదా అంటే కష్టమే అని చెప్పాలి.
ఎందుకంటే BRSకు ప్రతి సెగ్మెంట్ లోనూ రెబెల్ బెడద దాగి ఉంది. అన్ని పార్టీల లీడర్లని చేర్చుకోవడం, చేరినవారంతా సెగ్మెంట్ ను ప్రభావితం చేసే స్థాయి గల వ్యక్తులు కావడంతో.. MLAలపై ఎప్పట్నుంచో గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే 115 మంది లిస్టు ప్రకటించడంతో అసంతృప్తులు లోలోపల రగిలిపోతున్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు కాంగ్రెస్ కేసి చూస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీకి దిగితే ఏమవుతుందో తెలుసు కాబట్టే ఏదైనా పార్టీ అండ కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వారంతా ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లతో మంతనాలు జరుపుతున్నారు. పాతవారికి ఎలాగూ ఫిక్స్. ఇక ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించాల్సిందే. వీరి తర్వాత టికెట్లు ఆశిస్తున్న మూడో వర్గం.. ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికిప్పుడు హస్తం పార్టీలో చేరితే రెంటికీ చెడ్డవారం అవుతామన్న థింకింగ్ లో ఉన్నారు. హస్తం పార్టీ నుంచి హామీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఉన్న BRSను చెడగొట్టుకోవడం ఎందుకన్న భావనతో ఉన్నారు.
ఇక కాంగ్రెస్ గురించి చెప్పుకోవాలంటే.. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే స్థాయి ఆ పార్టీకి ఉందన్న మాట అందరిలోనూ ఉంది. కానీ ఆ పార్టీని ఎవరో ఓడించాల్సిన అవసరం లేదన్నది కూడా జనాల కామెంటే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. అంతర్గత కుమ్ములాటల గురించి. పోరు ముక్కోణమా, ద్విముఖమా అనేది BJP సీట్ల ప్రకటనను బట్టి ఉండనుంది. గెలవడం అటు తర్వాత.. ముందు కాంగ్రెస్ టికెట్ దక్కిందా లేదా అన్నదే ప్రెస్టీజియస్ ఇష్యూగా మారింది. నిజంగానే అప్లయ్ చేసుకున్న వాళ్లకే టికెట్లు అన్న మాట మీద నిలబడితే.. కొత్తగా చేరేవారి కథ క్లోజ్ అయినట్లే. అలా కాకుండా విన్నింగ్ ఛాన్సెస్ ఆధారంగా డిసిషన్ మార్చుకుంటే మాత్రం ఇపుడున్నవాళ్ల నుంచి రెబెల్ బెడద తప్పదు. ఏదైనా జరగొచ్చు అన్న విధానం వల్లే కాంగ్రెస్ లో టికెట్లకు అంత డిమాండ్ ఏర్పడింది. అందుకే ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో చాలా మంది టికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే పాతవాళ్లకే కట్టబెట్టి ఊగిసలాటతో ఉంటారా… కొత్త వాళ్లకు కేటాయించి తలనొప్పులు తెచ్చుకుంటారా అన్నది కాంగ్రెస్ పెద్దల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.