ముంబయిలో జరుగుతున్న విపక్షాల ‘ఇండియా’ కూటమి.. పలు నిర్ణయాలు తీసుకుంది. కూటమి మొత్తానికి కన్వీనర్ నియామకం అవసరం లేదన్నట్లుగా అందుకు తగ్గ పేరును ప్రకటించలేకపోయాయి. కన్వీనర్ స్థానంలో వివిధ పార్టీలకు చెందిన 14 మంది లీడర్లతో సమన్వయ కమిటీ(Co-Ordination Committee)ని ఏర్పాటు చేయాలని తీర్మానించాయి. ఆగస్టు 31(నిన్న), సెప్టెంబరు 1(ఈరోజు) తేదీల్లో జరిగిన సమావేశాలు ముగిశాయి. ‘ఇండియా కూటమి’ పురుడు పోసుకున్న తర్వాత ఇది థర్డ్ మీటింగ్ కాగా… తొలి సమావేశాన్ని పాట్నా, రెండో భేటీని బెంగళూరులో నిర్వహించారు. లోగో ఆవిష్కరణ, సమన్వయ కమిటీ ఏర్పాటు, ప్రచార కార్యక్రమాల నిర్వహణ, సీట్ల సర్దుబాటు అంశాలపై 28 పార్టీలకు చెందిన లీడర్లు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ నెల 30 లోపు సీట్ల సర్దుబాటు ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
అయితే లోగో ఆవిష్కరణపై పలువురిలో సందేహాలు వ్యక్తం కావడం, ‘ఇండియా కూటమి’ అయినందున జాతీయ పతాకాన్ని ఏ రకంగా రూపొందించాలన్న అంశంపై అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలన్న బాధ్యత కూడా ఉందన్న కోణంలో ఇప్పటికిప్పుడు లోగో ఆవిష్కరణను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు గురించి పలు పార్టీలు ప్రస్తావించగా.. దాన్ని ప్రధాన ప్రతిపక్షం తర్వాత చూసుకుందామన్నట్లుగా వ్యవహరించిందన్న మాటలు వినపడుతున్నాయి. అయితే ఉమ్మడిగా అన్ని పార్టీల నేతలంతా ప్రచారాల్లో పాల్గొంటేనే ప్రజల నుంచి మద్దతు దక్కుతుందన్న భావన ఏర్పడినట్లు… BJPకి అడ్డుకట్ట వేయాలంటే ఇదే సరైనదన్న ఆలోచన పార్టీ లీడర్లలో స్పష్టమైనట్లు తెలుస్తోంది.
సమన్వయ కమిటీలోని సభ్యులు వీరే
కాంగ్రెస్(AICC) K.C.వేణుగోపాల్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) శరద్ పవార్
ద్రవిడ మున్నేట్ర కజగం(DMK) MK స్టాలిన్
ద్రవిడ మున్నేట్ర కజగం(DMK) టి.ఆర్.బాలు
తృణమూల్ కాంగ్రెస్(TMC) అభిషేక్ బెనర్జీ
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) సంజయ్ రౌత్
రాష్ట్రీయ జనతా దళ్(RJD) తేజస్వి యాదవ్,
జనతాదళ్(యు)(JDU) లలన్ సింగ్,
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) రాఘవ్ చద్దా
జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) హేమంత్ సోరెన్
సమాజ్ వాదీ పార్టీ(SP) జాదవ్ అలీఖాన్
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(CPI) డి.రాజా
నేషనల్ కాన్ఫరెన్స్(NC) ఒమర్ అబ్దుల్దా,
పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(PDP) మహబూబా ముఫ్తీ