
Published 13 Nov 2023
ఒకవైపు పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న వేళ లోక్ సభ సందర్శకుల గ్యాలరీ(Visitors Gallery)లో హంగామా చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పైనుంచి సభలో దూకడంతో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభలోకి గ్యాస్ విడుదల చేసే వస్తువులను విసిరేశారు. జీరో అవర్ పూర్తవుతుందన్న సమయంలోనే పైనుంచి దూకుతూ బూట్లలో దాచుకున్న వస్తువుల్ని విసిరేయడంతో సభంతా పొగ అలుముకుంది. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడమే కాకుండా ఎంపీలంతా గందరగోళానికి గురయ్యారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో సభాపతి స్థానంలో రాజేంద్ర అగర్వాల్ ఉన్నారు. ఘటనకు పాల్పడ్డ ఇద్దరు దుండగుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరిగ్గా 2001లోనూ ఇదే రోజున పార్లమెంటుపై దాడి ఘటన జరిగింది.
భద్రతకు పెను సవాల్
లోక్ సభ సమావేశాల్ని పరిశీలించేందుకు గంట పాటు సందర్శకుల(Visitors)కు అవకాశం కల్పించారు. పూర్తి భద్రత నడుమ సభలోకి అనుమతించగా.. ఇలాంటి ఘటన జరగడం పట్ల పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పాస్ లు, ఇతర ఆధారాలు లేకుండా అనుమతించని భద్రతా సిబ్బంది, మొబైల్ ఫోన్లను సైతం తీసేసుకుంటారు. కానీ కాలి బూట్లలో దాచుకుని రావడం మాత్రం సంచలనంగా మారింది. ఒక వ్యక్తి పోలీసులు అదుపులో ఉండగానే టియర్ గ్యాస్ ను వదిలేశాడంటేనే ఎంతటి ప్లానింగ్ వచ్చాడో అర్థమవుతుందని కొంతమంది ఎంపీలు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ స్కానర్లతో జల్లెడ పట్టిన తర్వాతే ప్రతి ఒక్కర్నీ సభలోకి అనుమతించే పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు ఇలా వస్తువుల్ని దాచుకుని మరీ పార్లమెంటులోకి ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది.