కన్నడిగులకు 100% రిజర్వేషన్లు కల్పిస్తూ సిద్ధరామయ్య సర్కారు నూతన(New) బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అన్ని ప్రైవేటు పరిశ్రమల్లో గ్రూప్-C, గ్రూప్-D కేటగిరీల్లో కన్నడిగులను మాత్రమే నియమించేలా చట్టం చేసింది. మేనేజ్మెంట్ కేటగిరీలో 50%, నాన్-మేనేజ్మెంట్ కేటగిరీలో 75% మందిని కచ్చితంగా కన్నడవాసులనే నియమించాలన్నది నిబంధన.
మేనేజ్మెంట్, నాన్-మేనేజ్మెంట్ కేటగిరీల్లో అర్హత సాధించడానికి అభ్యర్థులు తప్పనిసరి(Mandatory)గా కన్నడ భాషగా సెకండరీ స్కూల్ సర్టిఫికెట్(SSC) కలిగి ఉండాలి. లేదంటే నోడల్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కన్నడ ప్రావీణ్య(Proficiency) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. తగిన అభ్యర్థులు దొరకని పక్షంలో సదరు పరిశ్రమలు స్థానిక అభ్యర్థులకు 3 సంవత్సరాల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలి.
కర్ణాటకలో పుట్టిన వ్యక్తి కనీసం 15 ఏళ్లు రాష్ట్రంలోనే ఉండి కన్నడంలో అనర్గళంగా మాట్లాడాలి. ఈ చట్టాన్ని పర్యవేక్షించేందుకు నోడల్ ఏజెన్సీ ఏర్పాటవుతుంది. కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్-2024 పేరిట తెచ్చిన బిల్లును ఉల్లంఘిస్తే రూ.10,000 నుంచి రూ.25,000 దాకా ఫైన్ వేయడంతోపాటు రోజుకు రూ.100 చొప్పున వసూలు చేస్తారు.