
Published 26 Nov 2023
ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి KCR రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, ఈటలను చూసి ఆయన భయపడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గజ్వేల్ లో బరిలోకి దిగిన బీజేపీ సింహం ఈటల రాజేందర్ అంటే CMకు వణుకు అని తూప్రాన్ బహిరంగ సభలో విమర్శించారు. BCల్లో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నప్పటికీ న్యాయం జరగడం లేదని, సామాజిక న్యాయం కేవలం BJPతోనే సాధ్యమని ప్రధాని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ సుల్తాన్ లను పెంచి పోషిస్తే BRS మాత్రం నిజాం నవాబు వారసులను అండగా చేసుకుందని, హస్తం పార్టీ పాలనలో విమానాల నుంచి హెలికాప్టర్ల వరకు కుంభకోణాలకు పాల్పడిందని మండిపడ్డారు. తమ పార్టీ MLAలు కొన్ని స్కీముల్లో 30 శాతం కమిషన్ తీసుకున్నారని స్వయంగా కేసీఆరే చెప్పారని మోదీ గుర్తు చేశారు.
ఫోన్లు మార్చగానే తప్పించుకోలేరు
అవినీతి కేసుల్లో ఇరుక్కున్న కేసీఆర్ కుటుంబ సభ్యులపై విచారణ కొనసాగుతుందని, ఫోన్లు మార్చినంత మాత్రాన జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని ప్రధాని అన్నారు. రైతులు, సైనికులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో అచ్చంగా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పార్టీకి తక్కువ కాదని నిరూపించిందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎలా పేపర్ లీకేజీలయ్యాయో తెలంగాణలోనూ అలాగే జరిగాయని అన్నారు. గ్రూప్-1 పరీక్షను నమ్ముకుని లక్షలాది మంది నిరుద్యోగులు చివరకు రోడ్డున పడాల్సి వచ్చిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.