ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి భారీ షాక్ తగిలింది. BJP ప్రభంజనం ముందు ఆ పార్టీ అగ్రనేతలంతా చేతులెత్తేశారు. ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ CM మనీశ్ సిసోడియా తమ తమ నియోజకవర్గాల్లో ఓటమి చవిచూశారు. న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన కేజ్రీవాల్.. ప్రత్యర్థి చేతిలో మట్టికరిచారు. BJP అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు. దశాబ్దకాలంగా దేశ రాజధానిని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. 27 ఏళ్లుగా పీఠం కోసం పోరాటం చేస్తున్న కమలం పార్టీ చేతిలో కంగుతింది. ఇక మనీశ్ సిసోడియా సైతం జంగ్ పుర నియోజకవర్గంలో BJP క్యాండిడేట్ తర్వీందర్ సింగ్ చేతిలో ఓడిపోయారు.
ఇక AAPకు భారీ ఊరటనిచ్చే అంశం.. అతీశీ విజయం. ముఖ్యమంత్రి అతీశీ విజయం సాధించి పార్టీ పరువు కాపాడారు. షాకూర్ బస్తీలో AAP నేత సత్యేంద్రకుమార్ జైన్ పై BJP నాయకుడు కర్నాల్ సింగ్ గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఉనికిని కూడా కాపాడుకోలేకపోయింది. ఒక్క స్థానంలోనూ గెలవలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.