Published 05 Dec 2023
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం గురించి అందరిలోనూ ఆసక్తి ఏర్పడిన దృష్ట్యా ముఖ్య’మంత్రి’ స్థాయి నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇవాళ్టి భేటీలు ఏ మేరకు పరిష్కారం చూపుతాయన్న భావన అంతటా కనిపిస్తున్నది. PCC మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అక్కడ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం ఆధారంగానే రాష్ట్రంలో పాలనా పగ్గాల తీరుపై ఒక అంచనాకు వచ్చే అవకాశం కనపడుతోంది. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్న వేళ ఇవాళ జరిగే పరిణామాలే కీలకం కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రానికి CM క్యాండిడేట్ ను ప్రకటిస్తామని ఊహాగానాలకు తెరదించారు.
రోజు బాగుందనా… వాతావరణం బాగా లేదనా…
రేవంత్ రెడ్డి ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ప్రమాణం చేబోతున్నారని.. 5, 6 తేదీల కన్నా ఆరోజే బాగుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వచ్చిన వార్త నిన్న సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ ఇప్పటికీ దీనిపై పెద్దగా క్లారిటీ కనిపించడం లేదు. పార్టీ అధిష్ఠానం నుంచి ప్రకటన వస్తే తప్ప ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేని తీరు నెలకొంది. అధిష్ఠానం(High Command)తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం వెలువడనుండగా.. CM, డిప్యుటీ CM, కీలక మంత్రుల స్థానాలపై నిర్ణయం తీసుకోవాల్సింది ఇవాళ్టి ఢిల్లీ భేటీయేనని చెప్పకనే చెబుతున్నారు. మరోవైపు నిన్న జరిగిన CLP భేటీ గురించి ఇప్పటికే హైకమాండ్ కు DK శివకుమార్ వివరించగా.. AICC ఆమోదం తర్వాతే ఆ విషయాన్ని హస్తం పార్టీ ప్రకటించబోతున్నది. ముఖ్యంగా సీఎం పదవి గురించి రేవంత్ రెడ్డి విషయంలో ప్రజల్లో సందేహాలు కనిపించకున్నా సోమవారం జరిగిన పరిణామాలు మాత్రం కొందరిని కలవరపాటుకు గురిచేశాయి.
ఖర్గే క్లారిటీతో సందేహాలు పటాపంచలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిందంటే ఆ పార్టీ హైకమాండ్ ముందునుంచీ వ్యవహరించిన తీరే కారణం. రేవంత్ కు PCC పగ్గాలు అప్పజెప్పాలన్న అనూహ్య నిర్ణయానికి తోడు ప్రచారంలో ఎక్కడా ఆధిపత్య ధోరణుల్లేకుండా సీనియర్లందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా చూసుకుంది. గతంలో తమ నియోజకవర్గాలకు తామే ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన నేతలు కూడా ఈ ఎన్నికల్లో మాత్రం నోరు మెదపకుండా ఉండిపోవడానికి రాహుల్, ఖర్గే నుంచి వచ్చిన సీరియస్ సంకేతాలే కారణమనే ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధికారంలోకి రావడం, CLP నేత సెలక్షన్ కు మీటింగ్ నిర్వహించడం వరకు బాగానే ఉంది. కానీ నిన్న సీఎల్పీ భేటీలో జరిగిన అంశాలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించాయి. దీనిపై శివకుమార్ నిన్న రాత్రే ఢిల్లీకి రిపోర్టు అందజేయగా దీనిపై హైకమాండ్ నుంచి ఈరోజు ఉదయం 10 గంటల వరకు కనీస వివరణ బయటకు రాకపోవడం ఆశ్చర్యంగా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ్, భట్టి ఢిల్లీ వెళ్లడం జరిగిపోగా ఆ ఇద్దరు బయల్దేరిన తర్వాత ఖర్గే నుంచి క్లారిటీ వచ్చింది.