Published 31 Dec 2023
అధికారం కోల్పోయిన తర్వాత ఆత్మశోధనలో పడిన BRS పార్టీ… మొన్నటి ఎన్నికల్లో ఓటమికి గల లోపాలపై దృష్టిసారించినట్లే కనపడుతోంది. ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయన్న దానిపై ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం(High Command) పూర్తిస్థాయిలో వివరాలు రాబడుతోంది. అతి తక్కువ సీట్లతో అధికారం, అత్యల్ప మెజార్టీతో శాసనసభ్యులను పోగొట్టుకున్న తర్వాత ‘ఎందుకిలా జరిగిందబ్బా’ అన్న కోణంలో శూలశోధన చేస్తోంది. ఇలాంటి సమయంలో మంత్రి కేటీ రామారావు ‘X’ వేదికగా చేసిన ట్వీట్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. కాలేజీలకన్నా ఛానళ్లు పెట్టుకుంటే బాగుండు అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. KCR పాలనా కాలంలో పలు యూట్యూబ్ ఛానళ్లకు ప్రభుత్వ పెద్దలకు పెద్ద యుద్ధమే జరిగిన సంగతి తెలిసింది. అందుకే కాలేజీల కన్నా యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే బాగుండేది అన్నది ట్వీట్ సారాంశం.
యూట్యూబ్ ఛానళ్లే బెటరేమో…
కేటీఆర్ ట్వీట్ చూస్తే… ‘ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నో విషయాల్ని పరిశీలిస్తున్నా.. చాలా ఆసక్తికరంగా అభిప్రాయాలు(Feedback) వస్తున్నాయి.. 32 మెడికల్ కళాశాలలు ప్రారంభించుకున్నాం.. కానీ కేసీఆర్ గారు 32 యూట్యూబ్ ఛానళ్లు పెడితే బాగుండేది.. వాటి ద్వారా తప్పుడు ఆరోపణలు, విమర్శల్ని తిప్పికొట్టేవాళ్లం.. ఒకరకంగా ఈ అబ్జర్వేషన్స్ ను ఏకీభవించాలి’.. అన్న కోణంలో ట్వీట్ చేశారు.