Published 26 Nov 2023
రాష్ట్రంలో అధికార BRS పార్టీకి చెందిన మంత్రులు, MLAలు భూకబ్జాదారులుగా మారిపోయారని.. కేసీఆర్ పాలనంతా అక్రమాలేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మంత్రులు, MLAల భూకబ్జాలకు అడ్డులేకుండా పోయిందని నారాయణపేట జిల్లా మక్తల్ సభలో విమర్శించారు. KCR పదేళ్ల పాలన పూర్తి అవినీతిమయమని, ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తాయని గుర్తు చేశారు. ప్రజల కోసం చేయాల్సిన పనులు వదిలేసి దందాలు చేయడమే BRS MLAల పని అని విమర్శలు చేశారు.
గెలిస్తే టెక్స్ టైల్ పార్కులు
కమలం పార్టీ అధికారంలోకి వస్తే మక్తల్, నారాయణపేటలో టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్న అమిత్ షా.. కేసీఆర్ అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. ముఖ్యమంత్రిని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్న షా.. BRS, కాంగ్రెస్ ఎప్పుడూ కుటుంబ రాజకీయాలే గురించి ఆలోచిస్తాయన్నారు. కేంద్రంలో రాహుల్ ను ప్రధానిగా, రాష్ట్రంలో కేసీఆర్ ను CMగా గెలిపించాలనేది ఆ రెండు పార్టీల వ్యూహమని అమిత్ షా అన్నారు.