Published 24 Jan 2024
లోక్ సభ ఎన్నికల షెడ్యూలే రాలేదు.. ‘ఇండియా కూటమి(INDIA Alliance)’లో మాత్రం లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. BJP సర్కారుపై ఉమ్మడి పోరాటం చేస్తామని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అది కనపడటం లేదు. తమ వ్యవహారా(Matters)ల్లో జోక్యం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చారు. అటు తృణమూల్ కాంగ్రెస్ తోపాటు పంజాబ్ లోని ఆప్ సర్కారు సైతం అదే మాటను తేల్చి చెప్పింది. పొత్తులపై TMCతో చర్చలు జరుపుతామని నిన్న రాహుల్ గాంధీ ప్రకటిస్తే తెల్లారేసరికి మమత క్లారిటీ ఇచ్చారు. ఒంటరిగానే తమ రాష్ట్రంలోని 42 సీట్లలో పోటీ చేస్తామని గట్టిగా చెప్పారు. ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ రాహుల్ మాటల్ని పక్కనపెట్టినట్లు మాట్లాడారు.
ఆ సీట్లలో పోటీ చేసుకోవచ్చుగా…
‘ప్రాంతీయ పార్టీల సీట్లు వదలిపెట్టి కాంగ్రెస్ 300 సీట్లలో పోటీ చేసుకోవచ్చు.. మా విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని సహించేది లేదు.. రీజినల్ పార్టీలన్నీ కాంగ్రెస్ కు పోటీగా బరిలోకి దిగుతాయి.. ఇండియా కూటమిలో ఏదైనా చర్చించాలనుకుంటే లోక్ సభ ఎన్నికల తర్వాతే.. ఎన్నికల తర్వాతే ప్రాంతీయ పార్టీలన్నీ చర్చలు జరుపుతాయి’ అంటూ నిర్మొహమాటంగా చెప్పారు. భారత్ జోడో న్యాయయాత్ర బెంగాల్ షెడ్యూల్ పై తనకు సమాచారం లేకపోవడమే మమత ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. అటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో సంబంధం లేదని తేల్చిచెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో AAP ఒంటరిగానే పోటీ చేస్తుందని మమత మాదిరిగానే మాన్ క్లారిటీ ఇచ్చారు.
నాకు చెప్పకూడదా…
పశ్చిమబెంగాల్ లో భారత్ న్యాయ యాత్ర నిర్వహిస్తే తనకు మాట మాత్రమైనా చెప్పకూడదా అని మమత నిలదీశారు. రాహుల్ న్యాయ యాత్ర గురించి నేను తెలుసుకోవాలనుకున్నా.. కానీ దాని గురించి సమాచారమే లేదు అంటూ ఆమె మండిపడ్డారు. తృణమూల్ తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని మంగళవారం నాడు రాహుల్ అన్నారు. బెంగాల్ లో ఒంటరి పోరుకే సిద్ధమన్నట్లు ఇంతకుముందే సంకేతాలిచ్చిన మమతకు భిన్నంగా రాహుల్ నిన్న TMC సంబంధాల గురించి మాట్లాడారు. కానీ ఇప్పటికే గుర్రుగా ఉన్న దీదీ.. రాహుల్ కు రివర్స్ కౌంటరిస్తూ మొత్తం 42 సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.