వచ్చే ఎన్నికల దృష్ట్యా అన్ని పార్టీలు BC మంత్రం జపిస్తున్న వేళ.. కాంగ్రెస్ ఒకడుగు ముందుకేసింది. రాబోయే ఎన్నికల్లో BCల మద్దతు తీసుకోవాలన్న టార్గెట్ తో కాంగ్రెస్ హైకమాండ్.. సంప్రదింపులను వేగవంతం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్(Incharge) మాణిక్ రావ్ ఠాక్రే.. BC సంఘాల లీడర్ ఆర్.కృష్ణయ్య ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల గురించి చర్చించిన వారిద్దరూ.. వచ్చే ఎన్నికల్లో మద్దతు అంశాన్ని ప్రస్తావించారు. బీసీ కులాలు హస్తం పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని ఠాక్రే వివరించారు. OBCలకు న్యాయం చేయాలని, వారిని క్రియాశీల రాజకీయాల్లోకి మరింతగా తీసుకురావాల్సి ఉందని రాహుల్ గాంధీ ఆదేశించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాణిక్ రావ్ వివరించారు. తెలంగాణలో బీసీ కులాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి సమస్యలపై కృష్ణయ్యతో చర్చించామని తెలియజేశారు. ఆర్.కృష్ణయ్య ప్రస్తావించిన డిమాండ్లు కాంగ్రెస్ ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయని, అధికారంలోకి వచ్చి ఓబీసీల సమస్యల్ని హస్తం పార్టీ పరిష్కరిస్తుందని ఠాక్రే స్పష్టం చేశారు.
బీసీలను సమన్వయం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇంతకుముందే భేటీ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంట్లో జరిగిన మీటింగ్ కు మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి సహా సీనియర్లంతా అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ సంఘాల నేతల్ని కలవాలని నిర్ణయించారు.